కొంపముంచుతున్న ఏపీకే ఫైల్స్
గోల్డెన్ న్యూస్ న్యూస్ / వెబ్ డెస్క్ : టెక్నాలజీ పెరుగుతున్నా కొద్దీ.. సైబర్ నేరాల సంఖ్య కూడా అధికమవుతున్నది. దీంతో సంవత్సరాలుగా సంపాదించి దాచుకున్న సొమ్ము ఒక్క క్షణంలో మాయమవుతున్నది.
కేటుగాళ్లు నకిలీ యాప్స్ ను మెసేజ్ రూపంలో పంపిస్తూ స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి ఉన్నదంతా దోచుకుంటున్నారు. ఆశ చూపి సైతం దోచుకుంటున్నారు. వీటికి వాట్సాప్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా యాప్ లు వేదికగా నిలుస్తున్నాయి.
లోన్ల పేరుతో..
నగరంలో ఉద్యోగాల కోసం వస్తున్న యువత టార్గెట్గా సైబర్ నేరగాళ్లు దోపిడీకి పాల్పడుతున్నారు. ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారి నంబర్లు సేకరించి.. వారికి లోన్లు ఇస్తామంటూ మేసేజెస్ పంపిస్తున్నారు. ఆర్థిక అవసరాలు ఉన్న యువత సైబర్ నేరగాళ్ల వలలో పడతున్నారు. లోన్ మంజూరు చేసేందుకు కొంత మొత్తం సర్వీస్ చార్జ్ రూపంలో చెల్లించాలని చెప్పడంతో ఇచ్చేస్తున్నారు. మాదాపూర్ లో ప్రైవేట్ స్కూళ్లో పని చేస్తున్న ఓ మహిళ లోన్ కోసం రూ.35 వేలు చెల్లించి మోసపోయింది. ఆ తరువాత సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రైవేట్ ఉద్యోగులే టార్గెట్ గా.
బిజినెస్ ఇన్వెస్ట్ మెంట్, స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, పార్ట్ టైం జాబ్స్, డిజిటల్ అరెస్ట్, ఫేక్ కస్టమర్ కేర్, డెబిట్, క్రెడిట్ కార్డ్ ఫ్రాడ్స్, ఫ్రీ ఆఫర్స్, కేవైసీల పేరుతో సైబర్ క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. బ్యాంక్ లోగోలతో అప్లికేషన్లు సృష్టించి వాట్సాప్, టెలిగ్రామ్ యాప్స్ ద్వారా ఏపీకే ఫైల్స్ పంపిస్తూ ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఆ తర్వాత బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. కాగా, సైబర్ నేరగాళ్లు టార్గెట్గా ఎంచుకున్న వారిలో 56 శాతం మంది ప్రైవేటు ఉద్యోగులే ఉండడం గమనార్హం.
వీరు ఎక్కువగా ఆన్ లైన్ లావాదేవిలు నిర్వహిస్తుండడంతో సైబర్ నేరగాళ్లు టార్గెట్గా ఎంచుకుంటున్నట్లు తెలుస్తున్నది. 2024లో సైబర్ నేరగాళ్లు రూ.1869.9 కోట్లు కొల్లగొట్టారు. వాటిలో సుమారు రూ.1050 కోట్లు ప్రైవేట్ ఉద్యోగులవే కావడం గమనార్హం. రూ.186.9 కోట్లు సెల్ఫ్ ఎంప్లాయ్ మెంట్ పొందుతున్న వారివి.
ట్రేడింగ్ పేరుతో నష్టపోతున్న ఐటీ ఉద్యోగులు
రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ టార్గెట్ గా సైబర్ క్రైమ్ ఎక్కువగా జరుగుతున్నది. ఐటీ రంగం అభివృద్ధి చెందడం, వ్యాపారాలు సమృద్ధిగా ఉండడంతో సైబర్ నేరస్తులు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తున్నది. అధిక లాభాల పేరుతో ఐటీ ఉద్యోగులను ట్రేడింగ్ లో దింపుతున్నారు. ట్రేడింగ్ పేరుతో పెట్టుబడి పెట్టి రూ. 2 లక్షల నుంచి 50 లక్షల వరకు పోగొట్టుకున్న వారు ప్రతి పది మంది ఐటీఉద్యోగుల్లో నలుగురు ఉన్నారు. సంవత్సరాలుపాటు కష్టపడి సంపాదించిన డబ్బ ఒక్కసారిగా పోవడంతో కుటుంబసభ్యులకు సైతం చెప్పుకోలేకపోతున్నారు. ట్రేడింగ్ లో పెట్టుబడి పెట్టినప్పడు షేర్ ధర రూ. 200 ఉంటున్నదని, ఆ తర్వాత కొద్ది రోజులకే రూ.10కి పడిపోతున్నదని, ఇలా తాము నష్టపోతున్నామని ఐటీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి, ఏమని కంప్లయింట్ చేయాలో కూడా అర్థం కావడం లేదని చెబుతున్నారు.