పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్ట్ దంప‌తులు

♦. ఆపరేషన్ కగార్’తో భయం భయం

 

♦తెలంగాణలో లొంగిపోతున్న మావోయిస్టులు-

 

♦ రాచకొండ సిపీ ఎదుట గురువారం మరో ఇద్దరు సరెండర్‌! 

 

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణలో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసిపోతున్నారు. అనేక మంది మావోలు ఆయుధాలు విడిచిపెట్టి జనంలోకి వస్తున్నారు. తాజాగా రాచకొండ పోలీసుల ఎదుట ఇద్దరు కీలక మావోయిస్టు నేతలు లొంగిపోయారు. జననాట్య మండలి ఫౌండర్ సంజీవ్, ఆయన భార్య పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆంధ్ర, తెలంగాణ, దండకారణ్య ప్రాంతంలో ఈ ఇద్దరు మావోయిస్టులు పనిచేస్తున్నారు. గద్దర్‌తో పాటు జననాట్య మండలి వ్యవస్థాపకుడిగా సంజీవ్ ఉన్నారు. అలాగే దండకారణ్యం స్పెషల్ జోనల్ సెక్రెటరీగా కూడా సంజీవ్ పనిచేశారు. సంజీవ్‌తో పాటు ఆయన భార్య దీనా కూడా పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిద్దరిని ఈరోజు (గురువారం) మధ్యాహ్నం 12 గంటలకు సీపీ సుధీర్ బాబు మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. రెండు రోజుల క్రితం ఆత్రం లచ్చన్న, చౌదరీ అంకు భాయి రామగుండం పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే. వారం వ్యవధిలోనే నలుగురు కీలక నేతలు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

 

 

 

 

కాగా.. మావోయిస్టు పార్టీని అంతమొందించడమే లక్ష్యంగా 2024, జనవరి నుంచి కేంద్ర ఆపరేషన్ కగార్‌ను చేపట్టింది. ఈ ఆపరేషన్‌లో ఎంతో మంది మావోలు ప్రాణాలు కోల్పోయారు. మావోయిస్టు కీలక నేతలు ఒక్కొక్కరిగా నేలరాలుతున్నారు. దీంతో మావోయిస్టు ఉద్యమం బలహీనపడింది. ఆపరేషన్ కగార్‌తో మావోయిస్టుల్లో కూడా భయాందోళన నెలకొంది. దీంతో చాలా మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోతున్న పరిస్థితి. గత ఆరు నెలల్లో వందల సంఖ్యలో మావోస్టులు పోలీసులకు సరెండర్ అయ్యారు. ఆపరేషన్ కగార్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 85 మంది మావోయిస్టులు హతమయ్యారు. వేల సంఖ్యలో జవాన్లు ఆపరేషన్‌ కగార్‌లో పాల్గొని మావోయిస్టులను మట్టుబెట్టే పనిలో ఉన్నారు. మావోయిస్టులు ఎటూ తప్పించుకోకుండా చేయడంతో పాటు వారి నివాస స్థావరాలను ధ్వంసం చేస్తున్నారు. వారికి నిలువ నీడ లేకుండా చేయడంతో ఆర్థికంగా, ఆరోగ్య పరంగా కూడా మావోయిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోతున్న పరిస్థితి..

Facebook
WhatsApp
Twitter
Telegram