♦ ఒక వ్యక్తికి ఇద్దరు, అంతకు మించి భార్యలు ఉండటం సాధారణ విషయమే.
♦ కానీ అక్కడ ఒకే వేదికపై ఓకే వధువుకు అన్నదమ్ముళ్లతో వివాహం ఆశీర్వదించిన బంధువులు!
♦ జోడీధార్ సంప్రదాయం అంటే ఏమిటో తెలుసుకుందాం?
ఒక వ్యక్తికి ఇద్దరు, అంతకు మించి భార్యలు ఉండటం సాధారణ విషయమే. కానీ ఒక మహిళకు పలువురు భర్తలు ఉండటం చాలా అరుదు. హిమాచల్‌ప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఓ వివాహం అందరి దృష్టిని ఆకర్షించింది. హట్టి తెగకు చెందిన ప్రదీప్, కపిల్ నేగి అనే అన్నదమ్ములు బంధుమిత్రుల సమక్షంలో సునీత చౌహాన్ అనే యువతికి తాళి కట్టారు. సిర్మౌర్ జిల్లా ట్రాన్స్‌గిరీ ప్రాంతంలో మూడ్రోజుల పాటు వైభవంగా ఈ వివాహం జరిగింది. యువకులు ఇద్దరూ ఉన్నత విద్యను అభ్యసించి ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ జోడీధార్ సంప్రదాయంలోనే పెళ్లి చేసుకున్నారు.
ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరైన బంధువులు, స్థానికులు జానపద పాటలు, నృత్యాలతో అలరించారు. కాగా, ఈ వివాహం తమకు గర్వంగా ఉందని ఇద్దరం కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్లి కుమారులు తెలిపారు.
జోడిదర్.
జోడీధార్ సంప్రదాయాన్ని భారత్‌లోని కొన్నితెగలు ఇప్పటికే పాటిస్తున్నాయి. సామాజికంగా, సాంకేతికంగా ఎన్నో మార్పులు వస్తున్నా నేటికీ ఈ ఆచారాన్ని కొనసాగిస్తున్నాయి. పైగా బహుభర్తృత్వ వ్యవస్థ ద్వారా లాభాలే తప్ప నష్టాలు లేవని చెబుతున్నాయి. తాజగా ఓ యువతి ఇద్దరు అన్నదమ్ములు పెళ్లిచేసుకోవడంతో ఈ జోడీధార్ సంప్రదాయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువమంది అన్నదమ్ములు ఒకే మహిళను వివాహం చేసుకునే సంప్రదాయమే జోడీధార్. దీన్ని జజ్‌దా అని కూడా పిలుస్తుంటారు.
పెళ్లి కుమారుడి ఇంటికి వధువును ఊరేగింపుగా తీసుకొని వస్తారు. అక్కడ జరిగే వివాహ తంతును సీంజ్‌గా వ్యవరిస్తారు. ఆ మహిళకు పుట్టే పిల్లలకు భర్తల్లో పెద్ద సోదరుడిని తండ్రిగా పేర్కొంటారు. బహుభర్తృత్వంపై నిషేధం ఉన్నప్పటికీ జోడీధార్ చట్టం ప్రకారం స్థానిక ప్రభుత్వం దీన్ని గుర్తిస్తున్నట్లు సమాచారం.
హిమాచల్‌ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లో హట్టీ అనే తెగ ఉంది. సిర్మౌర్ జిల్లాలో పర్వత ప్రాంతాల్లోని దాదాపు 450 గ్రామాల్లో వీరు వ్యాపించి ఉన్నారు. మొత్తంగా వీరి జనాభా దాదాపు 3లక్షలు ఉంటుంది. ఇక్కడ శతాబ్దాలుగా జోడీదారా సంప్రదాయం ఆచరణలో ఉన్నప్పటికీ మహిళల్లో అక్షరాస్యత పెరగడం, ఆదాయ వనరులు అందుబాటులో ఉండటం వంటి కారణాలతో అనేక మంది దీనికి దూరంగా ఉంటున్నారు. కానీ, కొన్ని గ్రామాల్లో మాత్రం జోడీధార్ సంప్రదాయాన్ని అనుసరిస్తున్న ఘటనలు అప్పుడప్పుడూ వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్‌లోని జౌన్సార్ బాబర్, హిమాచల్‌లోని కిన్నౌర్ ప్రాంతాల్లోనూ దీనిని ఇంకా పాటిస్తున్నారు. బధానా గ్రామంలోనే గతఆరేళ్లలో ఈతరహా ఐదు వివాహాలు జరిగినట్లు తెలుస్తోంది.
పూర్వీకుల భూమి మరింత విభజనకు గురికాకుండా చూడటమే జోడీధార్ సంప్రదాయం వెనుక అసలు కారణం. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది సోదరులు ఒకే మహిళను పెళ్లి చేసుకోవడం ద్వారా ఉమ్మడి కుటుంబంలో సోదరభావం, పరస్పర అవగాహనను పెంచడం మరో కారణం. వేల ఏళ్ల కిందటే ఈ పద్ధతి మొదలైంది. పెద్ద కుటుంబం ఉండి, అందులో ఎక్కువ మంది పురుషులు ఉంటే గిరిజన సమాజంలో మరింత సురక్షితంగా ఉండవచ్చనే భావన కలుగుతుంది. – కేంద్రీయ హట్టీ సమితి జనరల్ సెక్రటరీ కుందన్ సింగ్ శాస్త్రి
జోడీధార్ సంప్రదాయాన్ని పాటించే తెగల్లో దీనిపై కొంచెం కూడా సంకుచిత భావంలేదు. ఈ ఆచారం వల్ల తమ కుటుంబవ్యవస్థ బలపడిందని హట్టీ తెగవారు చెబుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దు ప్రాంతాల్లోని హట్టీ తెగ సిర్మౌర్ పర్వత ప్రాంతాల్లోని 450 గ్రామాల్లో వ్యాపించి ఉంది. జనాభా దాదాపు 3లక్షలు కాగా, శతాబ్దాలుగా జోడీధార్ సంప్రదాయం ఆచరణలో ఉంది. అక్షరాస్యత పెరగడం వంటి కారణాలతో చాలామంది జోడీధార్ సంప్రదాయానికి దూరంగా ఉన్నా కొన్ని గ్రామాల్లో ఇప్పుటికీ ఆచరిస్తున్నారు. గడిచిన ఆరేళ్లలో జోడీధార్ సంప్రదాయంలో ఐదు వివాహాలు జరిగాయి.
జోడీధార్ సంప్రదాయం వల్ల నష్టాల కన్నా లాభాలే ఉంటాయి. కుటుంబ వ్యవహారాలు చక్కదిద్దేందుకు ఈ సంప్రదాయం బాగా ఉపయోగపడుతోంది. అన్నదమ్ములను పెళ్లి చేసుకోవడం వల్ల వారి ఆస్తి పంపకాలు ఉండవు. పైగా, ఒకరు సంపాందించడానికి వెళ్లినప్పుడు మరొకరు కుటుంబ వ్యవహారాలు చూసుకుంటాడు. ఇద్దరి భర్తల ద్వారా కుటుంబ ఆదాయం పెరిగి పిల్లల భవిష్యత్ బాగుంటుంది. మేము నలుగురు అన్నదమ్ములం. మేము జోడీదార సంప్రదాయంలో రెండు పెళ్లిలు చేసుకున్నాం. – హట్టీ తెగకు చెందిన వ్యక్తి