గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు రిజర్వేషన్ల విషయంలో ఆత్మవిశ్వాసంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. బీసీ హక్కుల కోసం అవసరమైతే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఒప్పించి రిజర్వేషన్లు సాధించి తీరతామని ఆయన స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బీసీ సామాజిక న్యాయం కోసం తన ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ దిశగా ముందడుగు వేసే సమయం ఆసన్నమైందని చెప్పారు.
42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహణకు కసరత్తు
రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం తెలిపారు. ఈ రిజర్వేషన్లతో త్వరలోనే స్థానిక ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోందని పేర్కొన్నారు. రైతుల ఉద్యమం సమయంలో మొదట మోడీ ప్రభుత్వం మొండికేసినప్పటికీ, చివరకు క్షమాపణ చెప్పే స్థితికి రావాల్సి వచ్చిందన్న ఉదాహరణను చెప్పుతూ, బీసీ రిజర్వేషన్ అంశంలోనూ అదే జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
బీజేపీ ధోరణిని విమర్శించిన సీఎం
బీజేపీ రాజకీయ ధోరణి ఏమిటంటే ‘తొలుత ససేమిరా అంటారు, తర్వాత పారిపోతారు’ అని విమర్శించిన సీఎం రేవంత్, బీసీల విషయంలో తమ ప్రభుత్వ లక్ష్యం చాలా స్పష్టమని అన్నారు. బీసీలకు న్యాయం చేయాలన్నది తమ ఆలోచన మాత్రమే కాదు, సంకల్పమని చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపీ అడ్డుపడినా, తమ నిర్ణయాన్ని అమలు చేయడంలో వెనకడుగు వేయమని ఆయన తేల్చి చెప్పారు.