కొత్తగా రేషన్ కార్డు వచ్చిన వారికి గుడ్‌న్యూస్

 త్వరలో  అందుబాటులోకి ఆరోగ్యశ్రీ  సేవలు.

గోల్డెన్  న్యూస్ / తెలంగాణ :  రాష్ట్రంలో కొత్తగా రేషన్ కార్డులు పొందిన కుటుంబాలకు త్వరలో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయంపై వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది.

 

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులకు వైద్య సేవలు అందుతున్న సంగతి తెలిసిందే. అయితే 2025 జనవరి 1 నాటికి రాష్ట్రంలో ఉన్న మొత్తం 89.95 లక్షల రేషన్ కార్డులకు అనుబంధంగా 2.81 కోట్ల మంది పేర్లు ఆరోగ్యశ్రీ పోర్టల్‌లో నిక్షిప్తమయ్యాయి. వీరికి నెట్‌వర్క్ ఆసుపత్రుల ద్వారా నిబంధనల మేరకు ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి.

 

కొత్తగా 6 లక్షల కార్డులు – 30 లక్షల మందికి అవకాశం_

 

ఈ ఏడాది జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటి వరకు సుమారు 6 లక్షల కొత్త కార్డులు జారీ కాగా, వాటితో కలిసి మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 95.56 లక్షలకు చేరుకుంది. ఇందులో కొత్తగా చేరిన లబ్ధిదారుల సంఖ్య 30 లక్షలు. వీరి వివరాలు త్వరలో ఆరోగ్యశ్రీ పోర్టల్‌లోకి ఎక్కించనున్నట్లు అధికారులు తెలిపారు. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను తగిన ఆదేశాలు జారీ చేశారు.

 

10.72 లక్షల మందికి సేవలు – రూ.1,590 కోట్ల బిల్లులు చెల్లింపు

 

డిసెంబరు 2023లో ప్రభుత్వం మారిన తర్వాత ఆరోగ్యశ్రీ సేవల వినియోగం మరింత పెరిగింది. మంత్రి దామోదర వెల్లడించిన వివరాల ప్రకారం, కొత్త ప్రభుత్వ పాలనలో ఇప్పటివరకు 10.72 లక్షల మందికి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య సేవలు లభించాయి. ఈ సేవల కోసం ప్రభుత్వం ఆసుపత్రులకు మొత్తం రూ.1,590 కోట్లకు పైగా బిల్లులు చెల్లించినట్లు తెలిపారు.

 

 ప్రైవేట్ ఆసుపత్రులు ఆసక్తితో ముందుకు

 

ప్రతి నెలా సగటున రూ.100 కోట్ల వరకు ప్రభుత్వం బిల్లుల చెల్లింపులు చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం 461 ప్రైవేట్ మరియు కార్పొరేట్ ఆసుపత్రులు ఈ సేవలు అందిస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన అన్ని ఔషధాలు కూడా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram