చేపల పెంపకం లాభదాయకం. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

గోల్డెన్ న్యూస్ / మణుగూరు : చేపల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటుందని వెంకటేశ్వర్లు  పేర్కొన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం ఇచ్చే రంగంగా అభివృద్ధి చెందుతోంది అని, రైతులు, యువత, మహిళా స్వయం సహాయక బృందాలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఆర్థికంగా ఎదగాలని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. శనివారం అశ్వాపురం రైతు వేదికలో నిర్వహించిన సంపూర్ణత అభియాన్ ఆకాంక్ష మేళా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – ఆకాంక్ష మేళా కార్యక్రమం నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అమలవుతున్న ప్రాధాన్యత గల కార్యక్రమమని, దీని ప్రధాన ఉద్దేశం ఆకాంక్ష జిల్లాలలోని స్వదేశీ ఉత్పత్తుల ప్రదర్శనకు, మార్కెట్ లభ్యతకు తోడ్పడటం అని పేర్కొన్నారు.

 

ప్రత్యేకంగా చేపల పెంపకంపై దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో చిన్న చిన్న నీటి వనరులు, చెరువులు, గుంటలను సమర్థంగా వినియోగించి చేపల పెంపకం ద్వారా రైతులు ఆదాయ మార్గాలు విస్తరించుకోవచ్చని తెలిపారు. బోన్‌లెస్ చేప మాంసానికి మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉందని, దీనివల్ల మత్స్యకారులు అధిక లాభాలు గడించవచ్చని ఆయన సూచించారు.

 

చేపల ముళ్ళను సూప్ తయారీలో ఉపయోగించటం, చేపల వ్యర్థాలను ఎండబెట్టి కంపోస్ట్ ఎరువులుగా వినియోగించడం ద్వారా పూర్తి స్థాయిలో వనరుల వినియోగం సాధ్యమవుతుందని వివరించారు. ఇది పర్యావరణ పరిరక్షణతోపాటు ఖర్చుల తగ్గింపుకూ దోహదపడుతుందని చెప్పారు.

 

చిన్న ట్యాంకులు, గుంటలు వంటి ప్రాథమిక వనరుల సహాయంతో చేపల పెంపకం మొదలుపెట్టి, అనుభవంతో పెద్ద స్థాయిలో చేపల ఫామ్‌లు అభివృద్ధి చేయవచ్చని, ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పలువురు రైతులు ఈ విధానంలో ఉన్నత స్థాయిలో ఆదాయం సంపాదిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

 

ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ అధికారులు రాంబాబు అధికారులు, రైతులు, స్వయం సహాయక బృందాల ప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram