గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాలు, మండలాలను ఆకాంక్షిత జిల్లా, బ్లాక్లుగా గుర్తించి నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో వేగవంతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, సామాజిక ప్రగతికి కేంద్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా రాజ్ భవన్‌లో నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవంలోరాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ కు అవార్డు ప్రధానం చేశారు. నీతి ఆయోగ్ ఆకాంక్షిత జిల్లాల అభివృద్ధిలో భాగంగా విద్య, ఆరోగ్యం, వైద్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, సామాజిక సంక్షేమం వంటి ఆరు ముఖ్య సూచికలపై 100 శాతం అభివృద్ధి లక్ష్యంగా సంపూర్ణత అభియాన్ కార్యక్రమం చేపట్టబడింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఈ ఆరు సూచికలలో మూడు సూచికలపై శాతం సంపూర్ణత సాధించి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందింది. అంతేకాక, గుండాల మండలం బ్లాక్ స్థాయిలో ఐదు సూచికలను విజయవంతంగా పూర్తి చేసి ఆకాంక్షిత బ్లాక్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. నీతి ఆయోగ్ అధికారి బృందాలు చేసిన సమీక్షల ఆధారంగా జిల్లా స్థాయిలో భద్రాద్రి కొత్తగూడెం ను అవార్డు కోసం ఎంపిక చేయడం జరిగింది.
ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ…ఈ అవార్డు రావడం జిల్లాలోని అధికార యంత్రాంగం, మండల అధికారులు, గ్రామ స్థాయి సిబ్బంది ప్రజల చొరవకు గుర్తింపుగా నిలిచింది అని అన్నారు.