ఆర్ఎంపీ, పీఎంపీలకు గుడ్ న్యూస్.

గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణలో ఆర్ఎంపీ, పీఎంపీల సమస్యకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి, అర్హత కలిగిన వైద్యుల కొరతను తీర్చడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అర్హత కలిగిన వైద్యులకు ప్రత్యేక అలవెన్సులు ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.సచివాలయంలో ఇటీవల జరిగిన కలెక్టర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. ఆర్ఎంపీ, పీఎంపీలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారిని ఇబ్బందుల నుంచి బయటపడేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమస్యపై లోతుగా అధ్యయనం చేసి.. కొత్త జీవోను జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని వారికి సూచించారు.

 

ఇటీవల.. రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ ఆర్ఎంపీ, పీఎంపీల మెడికల్ ప్రాక్టీస్ నిబంధనలకు విరుద్ధమని భావించి.. పలు జిల్లాల్లో తనిఖీలు నిర్వహించింది. దీనిలో భాగంగా కొద్దిమందిపై ఎఫ్ఐఆర్‌లు కూడా నమోదయ్యాయి. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ, పీఎంపీలు వైద్యారోగ్య మంత్రిని కలిసి తమ గోడును వినిపించి, సమస్యలు తొలగించాలని విజ్ఞప్తి చేశారు. వారి విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న సీఎం, అధికారులకు స్పష్టమైన సూచనలు చేసి, కొత్త జీవో రూపొందించడానికి ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని స్పష్టం చేశారు.

 

గ్రామీణ వైద్యంపై దృష్టి..

ఈ సమస్య కేవలం ఆర్ఎంపీ, పీఎంపీల జీవనోపాధికి సంబంధించినది మాత్రమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలను మెరుగుపరచడానికి కూడా సంబంధించింది. ఎంబీబీఎస్ చదివి అర్హత కలిగిన వైద్యులతో ఆర్ఎంపీ, పీఎంపీలకు వస్తున్న వాగ్వివాదాలను నివారించడంపైనా ప్రభుత్వం దృష్టి పెట్టింది. ప్రస్తుతం.. చాలా మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో అర్హత కలిగిన వైద్యులు అందుబాటులో ఉండటం లేదు.

Facebook
WhatsApp
Twitter
Telegram