గోల్డెన్ న్యూస్/ వెంకటాపురం : మండల కేంద్రంలో ఇసుక లారీల రాకపోకల వల్ల లేస్తున్న దుమ్ము, ధూళి సమస్యపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఎం మండల కమిటీ డిమాండ్ చేసింది. శుక్రవారం మండల తహసీల్దార్కు మెమోరాండం అందజేసిన సిపిఎం నాయకులు, మండల కార్యదర్శి గ్యానం వాసు మాట్లాడుతూ మండలంలోని ఏడు ఇసుక ర్యాంపులు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ర్యాంపుల నుండి వందలాది లారీలు వెంకటాపురం మీదుగా వెళ్ళడం వల్ల కూరగాయలు, తినుబండా రాలు కలుషితమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దుమ్ము కారణంగా ప్రజలు ఊపిరితిత్తుల వ్యాధులు, ఇతర అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటూ, దుమ్ము నియంత్రణ మిషన్ ద్వారా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఇసుక ర్యాంపుల వద్ద లారీలకు ప్రత్యేక పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసి, ట్రాఫిక్ సమస్యను నివారించాలని, అలాగే రోజుకు 80 లారీలకే లోడింగ్ పరిమితి అమలు చేయాలని మెమోరాండంలో సూచించారు. ఈ కార్యక్రమంలో చిట్టెం ఆదినారాయణ, గుండమల్ల ప్రసాద్, ఇరుప శీను, కోగిల మాణిక్యం, తోట నాగేశ్వరరావు తదితర సిపిఎం నాయకులు పాల్గొన్నారు.
