ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తి చేయాలి

గోల్డెన్ న్యూస్ /పెద్దపల్లి / ఎన్నికల సమయంలో ప్రజలకు సాధ్యం కానీ అమలు చేయలేని హామీలు ఇచ్చి 420 హామీలతో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ గా ముఖ్యమంత్రి రెడ్డి వ్యవహరిస్తున్నారని, ప్రజల గొంతును కాంగ్రెస్ ప్రభుత్వం కోసిందని బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌  విరుచుకుపడ్డారు.  పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్‌ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రితో పాటు మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, పుట్ట మధుకర్‌, మాజి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, జడ్పీటీసీ గంట రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి ప్రదర్శించడంతో ఈ ఏడాది ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీటి కొరత ఏర్పడిందని  ఆరోపించారు. నీటి నిర్వహణ కమిటీ నిర్ణయం ప్రకారం గోదావరి బేసిన్‌లో 6 లక్షల ఎకరాలకు మాత్రమే నీటిని అందిస్తామని, అందులో వరి పంటకు 3,93,430 ఎకరాలు, ఆరుతడి పంటలకు 78,307 ఎకరాలకు మాత్రమే సాగునీరు ఇస్తామనడం రైతాంగానికి పెద్ద దెబ్బ అని తెలిపారు. ఎస్సారెస్పీ ఫేజ్‌-1లో 9.65 లక్షల ఎకరాలకు నీరు ఇవ్వాల్సి ఉండగా, కేవలం 2.34 లక్షల ఎకరాలకు మాత్రమే అందించారని,  దాదాపు 7.3 లక్షల ఎకరాలను ఎండబెట్టే పరిస్థితి ప్రభుత్వం సృష్టించిందని మండిపడ్డారు.గత నెలలో 6.5 లక్షల ఎకరాలకు నీరు ఇస్తామని చెప్పి, ఇప్పుడు 2.3 లక్షల ఎకరాలకు మాత్రమే ఇస్తామని చెప్పడం దారుణమని విమర్శించారు. ఫేజ్‌-2 ప్రస్తావనే లేదని, రైతులు నాట్లు పూర్తిచేసే సమయానికే నీటి లెక్కలు ప్రకటించడం ఏ విధానమో సీఎం చెప్పాలని డిమాండ్‌ చేశారు.కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే గతంలో ఎస్సారెస్పీ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 24.30 లక్షల ఎకరాలు సాగు అయ్యాయని, కేసీఆర్‌ పాలనలో కాకతీయ కాలువతో పాటు డిస్ట్రిబ్యూటరీల కింద ఉన్న చెరువులను కూడా క్రమం తప్పకుండా నింపినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 55 టీఎంసీల నీటితో 550 టీఎంసీలు నింపగలమంటూ రేవంత్‌ రెడ్డి చేసే వాగ్దానాలు ప్రజలను మోసం చేయడమేనని ఎద్దేవా చేశారు. ???? యూరియా కొరతపై విమర్శలు… రాష్ట్రంలో యూరియా కొరత విలయతాండవం చేస్తున్నదని ఈశ్వర్‌ తెలిపారు. కేంద్ర మంత్రి ప్రకారం వానాకాలానికి కావలసిన 22 లక్షల మెట్రిక్‌ టన్నుల ఎరువుల్లో, యూరియా అవసరం 9 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, కేవలం 4 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే అందించారని, ఇంకా 5 లక్షల టన్నుల కొరత ఉందని చెప్పారు. ప్రైవేట్‌ షాపుల్లో యూరియా బస్తా ధర రూ.266 బదులు రూ.350–400 వసూలు చేస్తున్నారని, అదనంగా ఇతర ఎరువులు కొనాల్సిన షరతులు పెడుతున్నారని విమర్శించారు.కేసీఆర్‌ హయాంలో బఫర్‌ స్టాక్‌ను 2 లక్షల టన్నుల నుండి 5 లక్షల టన్నులకు పెంచి ఎరువుల కొరత రాకుండా చర్యలు తీసుకున్నారని, ప్రస్తుత ప్రభుత్వం దాన్ని 3 లక్షల టన్నులకు తగ్గించడంతో సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ???? రైతు ఆత్మహత్యలు – రుణమాఫీపై విరుచుకుపాటు…. రేవంత్‌ రెడ్డి పాలనలో 600 రోజుల్లోనే 600 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇందుకు ప్రభుత్వ వైఫల్యాలే కారణమని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ 49 వేల కోట్ల రుణమాఫీ హామీ ఇచ్చి, ఇప్పటివరకు కేవలం 21 వేల కోట్లనే మాఫీ చేసిందని, అందరికీ రుణమాఫీ అయిందని అబద్ధపు సంబరాలు చేసుకున్నారని ఎద్దేవా చేశారు.కేసీఆర్‌ పాలనలో 11 విడతల్లో రూ.72 వేల కోట్ల రైతుబంధు మంజూరు చేశారని, ఒక్కసారిగా రూ.9 వేల కోట్లు ఇచ్చిన ఉదాహరణ దేశంలో ఎక్కడా లేదని గుర్తుచేశారు. ప్రస్తుతం మంత్రి లెక్కలు తెలుసుకోకుండా ఏది బడితే అది మాట్లాడుతున్నారని, ఇలాంటి అజాగ్రత్త వ్యాఖ్యలు అవమానకరమని వ్యాఖ్యానించారు. మీడియా సమావేశంలో పెద్దపల్లి పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్‌, జక్కుల శ్రీకాంత్‌, గోపు ఐలయ్య, నారాయణదాసు మారుతీ, జిట్టవేన ప్రశాంత్‌కుమార్‌, బొడ్డుపలి శ్రీను, నిమ్మరాజుల సాగర్‌, హర్షన పెల్లి, శ్రీనివాస్‌, బుర్రి వెంకన్న, రామరాజు, రమణ, మాచర్ల నరేష్‌, తాటికొండ శంకర్‌, అత్తె చంద్రమౌళి, జక్కుల ముత్తయ్య, నూనె కుమార్‌, కనవేన శ్రీనివాస్‌, మేకల సంపత్‌, ఉప్పరి శ్రీనివాస్‌, కొట్ట భూమయ్య, ఆకుల గట్టయ్య, పెగడ శ్రీనివాస్‌, పుప్పాల తిరుపతి, అనిల్‌ గౌడ్‌, నారాయణ, రాజ్‌కుమార్‌, సాన సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram