బీజేపీకి ప్రజాస్వామ్యంపై మాట్లాడే హక్కు లేదు : డిప్యూటీ సీఎం భట్టి

నెహ్రూ, గాంధీలను తప్పుగా చిత్రీకరిస్తున్నరు: డిప్యూటీ సీఎం భట్టి.

బీసీ బిల్లును ఆమోదించకుండా బీజేపీ రాజకీయం: పొన్నం

కాంగ్రెస్ చరిత్రను ఎవరూ తుడిచేయలేరు: మహేశ్ గౌడ్

గాంధీ భవన్లో క్విట్ ఇండియా దినోత్సవ వేడుకలు

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. నిత్యం నెహ్రూ, గాంధీల గురించి మాట్లాడుతూ వారిని తప్పుగా చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. శనివారం గాంధీ భవన్ లో క్విట్ ఇండియా దినోత్సవం, యూత్ కాంగ్రెస్ ఆవిర్భావం సందర్భంగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పార్టీ జెండాను ఎగురవేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డితోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. స్వాతంత్ర ఉద్యమానికి క్విట్ ఇండియా ఉద్యమం స్పూర్తి అని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై కోర్టుల మీద నమ్మకం ఉందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి కేంద్రానికి పంపామని, ఆ బిల్లును ఆమోదించకుండా బీజేపీ రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు. బిల్లులో ఎక్కడైనా ముస్లింల ప్రస్తావన ఉందా? అని కిషన్ రెడ్డిని మంత్రి ప్రశ్నించారు.

 

కిషన్ రెడ్డికి చదువు రాకపోతే పక్కన ఎవరి తోనైనా చదివించుకోవాలని ఎద్దేవా చేశారు. స్వాతంత్ర ఉద్యమం ఏ విధంగా జరిగిందో నేటి యువత తెలుసుకోవాలని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సూచించారు. 1942లో బ్రిటీష్ పాలకులు తరిమి కొట్టాలని అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందని, డూ ఆర్ డై నినాదంతో మహాత్మగాంధీ నేతృత్వంలో క్విట్ ఇండియా ఉద్యమం జరిగిందన్నారు.

 

ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ.. కాంగ్రెస్ చరిత్రను తుడిచివేయాలని చూస్తున్నదని, నెహ్రూ, సర్దార్, సుభాష్ చంద్రబోస్ చరిత్రలో లేకుండా చేద్దామని బీజేపీ, ఆర్ ఎస్ ఎస్ కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. ఎంక్వైరీ సంస్థలతో ప్రతిపక్షాలపై దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అంటే బీజేపీ జేబు సంస్థగా మారిందన్నారు. నకిలీ ఓట్లపై ఇటీవల రాహుల్ గాంధీ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను గాంధీ భవన్ లో ప్రదర్శించారు…

Facebook
WhatsApp
Twitter
Telegram