గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్: నగరంలో పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. బోడుప్పల్, మేడిపల్లి, ఉప్పల్, రామాంతపూర్, పీర్జాదిగూడ, కుత్బుల్లాపూర్, బహదూర్‌పురాలో వరుణుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. అలాగే నగరంలో ఇవాళ సాయంత్రం 6 గంటల వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దని జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. అయితే ఇప్పటికే.. హైదరాబాద్‌కు ఎల్లో అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే.
అలాగే రానున్న 3 గంటల్లో నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు అధికార యంత్రాంగం అలర్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో అమీర్‌పేట్, మైత్రివనం వద్ద వాటర్ లాగింగ్ పాయింట్స్‌ను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అవసరమైతే తప్ప ఎవరూ ప్రయాణాలు చేయకూడదని అధికారులు చెబుతున్నారు. కాగా, అన్ని శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో తెలంగాణలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని 8 జిల్లాలకు ఆరెంజ్, 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, మంచిర్యాల, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, వరంగల్ జిల్లాలకు భారీ వర్ష సూచన ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం సూచిస్తోంది..