సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు.. మంత్రి పొన్నం కీలక ప్రకటన..

గోల్డ్ న్యూస్/ హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే రాష్ట్రంలో సర్పంచ్, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతాయని పొన్నం స్పష్టం చేశారు.

 

ముస్లిం రిజర్వేషన్ల అంశాన్ని తమ ప్రభుత్వం ఎక్కడా ప్రస్తావించలేదని ఆయన పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్థానిక సంస్థల ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై వివరణ ఇచ్చారు. అసెంబ్లీలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ నేతలు మద్దతు పలికారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు ఆ పార్టీ కావాలనే ఎన్నికలను అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తున్నామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు. ఇప్పటికైనా కుట్రలను మానుకొని బీసీలకు న్యాయం చేయాలని ప్రతిపక్షాలను కోరారు.

 

ఇక స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు.. స్థానిక సంస్థల ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని ప్రభుత్వానికి సూచించింది. అయితే బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేటప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలైన ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. దీని ప్రకారం.. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల స్థితిగతులపై ప్రత్యేక కమిషన్‌ను ఏర్పాటు చేయడం, ఈ కమిషన్ సిఫారసుల ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీలకు ఎంత రిజర్వేషన్లు కల్పించవచ్చో లెక్కించడం, మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చూడటం వంటివి చూడాలన్నారు.

 

ఈ ట్రిపుల్ టెస్ట్ నిబంధనలను పూర్తి చేసి హైకోర్టుకు నివేదిక సమర్పించిన తర్వాతే ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు సూచించింది. ఈ ఆదేశాలకు అనుగుణంగానే తమ ప్రభుత్వం ఎన్నికలను నిర్వహిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. ప్రభుత్వం త్వరలోనే ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎన్నికలకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు. కాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చిన తెలంగాణ సర్కార్ బిల్లును రాష్ట్రపతికి పంపింది.

Facebook
WhatsApp
Twitter
Telegram