ఇంటర్నెట్ డెస్క్: బ్యాంకు ఖాతాల్లోని కనీస నిల్వల అంశంపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని చెప్పారు. దీనిపై ఆర్‌బీఐ నియంత్రణ ఏదీ ఉండదని పేర్కొన్నారు. కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ (ICICI bank) గరిష్ఠంగా రూ.50 వేలకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న వేళ గుజరాత్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమం పాల్గొన్న సందర్భంగా ఆర్‌బీఐ గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ‘‘కనీస సగటు బ్యాలెన్స్ ఎంత ఉండాలి అనే నిర్ణయం ఆర్‌బీఐ బ్యాంకులకే వదిలేసింది. కొన్ని బ్యాంకులు రూ.10వేలు నిర్ణయిస్తాయి. మరికొన్ని రూ.2 వేలు ఉంచుతాయి. కొన్ని కనీస బ్యాలెన్స్ నిబంధనను ఎత్తివేశాయి. ఈ అంశం ఆర్‌బీఐ నియంత్రణ పరిధిలోకి రాదు’’ అని సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
పొదుపు ఖాతాల్లో కనీస నిల్వ లేనిపక్షంలో విధిస్తున్న అపరాధ రుసుమును ఇటీవల కొన్ని బ్యాంకులు ఎత్తివేస్తుండగా, ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రం అందుకు భిన్నంగా ఖాతాదార్లకు షాకిచ్చింది. సేవింగ్స్ అకౌంట్లోల కనీస నిల్వ మొత్తాన్ని భారీగా పెంచేసింది. 2025 ఆగస్టు 1 తర్వాత ఖాతా తెరిచిన వారికే ఇది వర్తించనుంది. మెట్రో, అర్బన్ ప్రాంతాల్లో ఖాతాదార్లు కనీసం రూ.50,000 నిల్వ ఉంచాలి. గతంలో ఈ మొత్తం రూ.10,000గా ఉండేది. ఇప్పుడు ఏకంగా 5 రెట్లు పెంచేసింది. సెమీ అర్బన్ ఖాతాదార్ల కనీస నిల్వ మొత్తాన్ని రూ.5,000 నుంచి రూ.25,000కు, గ్రామీణ ఖాతాదార్లకు రూ.2,500 నుంచి రూ.10,000కు సవరించింది. కనీస నిల్వ లేనిపక్షంలో ఛార్జీలు కనీస నిల్వకు ఎంత తక్కువ మొత్తం ఉంటుందో దానిపై 6 శాతం లేదా రూ.500 ఏది తక్కువైతే అది చెల్లించాల్సి ఉంటుందని ఐసీఐసీఐ బ్యాంక్ వెల్లడించింది. అయితే దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.