భారీ వర్షాలతో వరదలు.. గర్భిణికి అవస్థలు

 తాడు సహాయంతో గర్భిణీ మహిళను వాగు దాటించిన పోలీసులు.

 

గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల  : తాండూరు మండలం నర్సాపూర్ గ్రామంలో భారీ వర్షాలకు ఉధృతంగా ప్రవహిస్తున్న నర్సాపూర్ వాగు .రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో నర్సాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని దొడ్డిగూడెంలో తొమ్మిది నెలల గర్భిణి యమునకు పురిటి నొప్పులు వచ్చాయి.పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణీ మహిళను తాడు సహాయంతో వాగు దాటించిన పోలీసులు, గ్రామస్తులుగర్భిణికి పురిటి నొప్పుల విషయం తెలుసుకున్న తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్.. పోలీస్‌ సిబ్బందిని, ఈత గాళ్లను ఘటనాస్థలికి పంపారు. వారు తాళ్ల సాయంతో గర్భిణిని వాగు దాటించి అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఈ పరిస్థితికి కారణం సింగరేణి సంస్థనే అని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. వాగుకు అడ్డంగా మట్టి పొయ్యడంవల్ల దాదాపు 6 మీటర్ల ఎత్తున ఉన్న బ్రిడ్జి పూర్తిగా మట్టితో నిండిపోయిందని, దాంతో వరద నీరు బ్రిడ్జి మీది నుంచి పోతోందని, అందుకే గర్భిణి అవస్థలు పడాల్సి వచ్చిందని విమర్శిస్తున్నారు.

 

ఆదివాసీ గూడేలపై సింగరేణి అధికారుల నిర్లక్ష్యానికి ఈ ఘటన అద్దంపడుతోందని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఏ ఒక్క ప్రాణం పోయినా దానికి బెల్లంపల్లి ఏరియా ఉన్నతాధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని గొండ్వానా పంచాయతీ, రాయ్ సెంటర్ నర్సాపూర్ సభ్యుడు మడావి అమృతరావు డిమాండ్‌ చేశారు. ఆదివాసీల భూములు కావాలి కానీ, ఆదివాసీల కష్టాలు, అభివృద్ధి మీకు పట్టదా..? అని ఆయన ప్రశ్నించారు. తక్షణమే హైలెవల్ వంతెన నిర్మాణాన్ని చేపట్టకపోతే నూతనంగా ఏర్పాటుచేసే అబ్బాపూర్ ఓసీని అడ్డుకుంటామని హెచ్చరించారు. కాగా గర్భిణి యమున బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువుకు జన్మనిచ్చింది. త‌ల్లీబిడ్డ క్షేమంగా ఉన్న‌ట్లు వైద్యులు తెలిపారు.

Facebook
WhatsApp
Twitter
Telegram