వీధి కుక్కలు చుక్కలు చూపిస్తున్నాయ్

      ఇదిగో వీధి కుక్కలు చిట్టా 1.53 కోట్లు

2022 – 2024 మధ్యకాలంలో దేశంలో 89 లక్షలకుపైగా కుక్క కాటు కేసులు- సగం కేసులు ఏపీ సహా 6 రాష్ట్రాల్లోనే- రేబిస్ మరణాల్లో సగం 5 రాష్ట్రాల్లోనే!

వీధికుక్కలున్న రాష్ట్రాలు ఏవి? వీధి కుక్కలకు ఉన్న రాజ్యాంగపరమైన రక్షణలు ఏమిటి? 

కుక్క కాటు కలకలం, రేబిస్ మరణాల గణాంకాలు చెబుతున్నది ఏమిటి? 

ఈ కథనంలో తెలుసుకుందాం.

మన దేశంలో దాదాపు 1.53 కోట్ల వీధి కుక్కలు ఉన్నాయి. అంటే దేశ జనాభా(146 కోట్లు)లో దాదాపు 1 శాతానికి సమానమైన సంఖ్యలో ఇవి ఉన్నాయి. అత్యధికంగా వీధి కుక్కలు ఉన్న టాప్-10 రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ (2,059,261), ఒడిశా (1,734,399), మహారాష్ట్ర (1,276,399) ఉన్నాయి. రాజస్థాన్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో చెరో 10 లక్షలకుపైగా ఉన్నాయి. గుజరాత్‌లో 9.31 లక్షలు, బిహార్‌లో 6.96 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌లో 4.71 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. అత్యధికంగా వీధి కుక్కలు ఉన్న మెట్రో నగరాల్లో బెంగళూరు (1.36 లక్షలు), దిల్లీ (55,462), ముంబై (50,799), చెన్నై (24,827), కోల్‌కతా (21,146), హైదరాబాద్ (10,553) ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ 2023 నవంబరులో విడుదల చేసిన గణాంకాలే.

వీధి కుక్కలు లేని రాష్ట్రాలు

ఒక్క వీధి కుక్క లేని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో మణిపూర్, దాద్రా నగర్ హవేలీ, లక్షద్వీప్ ఉన్నాయి. మిజోరంలో 69, నాగాలాండ్‌లో 342 వీధి కుక్కలు మాత్రమే ఉన్నాయి.

 

వీధి కుక్కల నియంత్రణపై రాజ్యాంగంలోనూ ప్రస్తావన

భారత రాజ్యాంగం చాలా మహోన్నతమైంది. అది మూగజీవాలు, జంతువుల పరిరక్షణకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది. జంతువుల సంక్షేమం, పరిరక్షణతో పాటు, వాటికి వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలకు కేటాయిస్తున్నామని రాజ్యాంగంలోని ఆర్టికల్ 246(3) చెబుతోంది. యానిమల్ బర్త్ కంట్రోల్ (ABC) కార్యక్రమం ద్వారా వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చర్యలు చేపట్టాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (డబ్ల్యూ), ఆర్టికల్ 246 అంటున్నాయి.

కుక్క కాటు కేసులపై సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు

కుక్క కాటు కేసులు దేశంలో పెరిగిపోతుండటం ఆందోళనకర అంశం. దీనివల్ల ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తీవ్రమైన భయాన్ని వీధి కుక్కలు సృష్టిస్తున్నాయి. ఈ పరిస్థితిని ఆపాలి. దిల్లీ, జాతీయ రాజధాని ప్రాంతం (NCR)లోని వీధి కుక్కలను పట్టుకొని, ప్రత్యేకమైన డాగ్ షెల్టర్లకు తరలించాలి. ఇందుకోసం దిల్లీ మున్సిపల్ విభాగం 5వేల డాగ్ షెల్టర్లను 8 వారాల్లోగా ఏర్పాటు చేయాలి. కుక్కలకు బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు చేసేందుకు అవసరమైన మానవ వనరులను, పశు వైద్యులను సమకూర్చుకోవాలి. డాగ్ షెల్టర్లు వేదికగా దీర్ఘకాలం పాటు కుక్కల పోషణ కోసం ఏర్పాట్లు చేయాలి. ఆసక్తి కలిగిన వారికి వాటిని దత్తత ఇచ్చే ప్రణాళికలను సైతం సిద్ధం చేసుకోవాలి” అని తాజాగా ఆగస్టు 11న (సోమవారం) సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

 

కుక్క కాటు కేసుల్లో టాప్-10 రాష్ట్రాలు

మనదేశంలో నిత్యం ఎంతోమందిని వీధికుక్కలు కరుస్తున్నాయి. అవి కరవడంతో కొందరు రేబిస్ వ్యాధి బారినపడుతున్నారు. మరికొందరు సకాలంలో చికిత్స అందక చనిపోతున్నారు. పలువురు తీవ్ర గాయాలతో సతమతం అవుతున్నారు. 2022 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్యకాలంలో భారత్‌లో దాదాపు 89 లక్షలకుపైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. 2022లో 21.8 లక్షలు, 2023లో 30.5 లక్షలు, 2024లో 37.1 లక్షల కుక్క కాటు కేసులు నమోదవడం గమనార్హం. అంటే ఈ కేసులు ఏటా పెరుగుతూపోయాయి. ఆ మూడేళ్లలో దేశంలో ఏకంగా 45 శాతం మేర కుక్కకాటు ఘటనలు పెరిగాయి. 2022-2024 మధ్యకాలంలో అత్యధికంగా కుక్క కాటు కేసులు నమోదైన టాప్-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర (13.5 లక్షలు), తమిళనాడు (12.8 లక్షలు), గుజరాత్(8.40 లక్షలు), కర్ణాటక(7.57 లక్షలు), ఆంధ్రప్రదేశ్(6.49 లక్షలు), బిహార్(6.47 లక్షలు), ఉత్తరప్రదేశ్(5.85 లక్షలు), తెలంగాణ(3.33 లక్షలు), రాజస్థాన్ (3.32 లక్షలు), ఒడిశా (3.25 లక్షలు) ఉన్నాయి.

రేబిస్ మరణాల్లో టాప్-10 రాష్ట్రాలు ఇవే!

కుక్క కాటుకు గురైన వారికి ఇన్ఫెక్షన్ వల్ల రేబిస్ వ్యాధి వచ్చే ముప్పు ఉంటుంది. దీనివల్ల ఏటా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 59వేల మరణాలు సంభవిస్తుంటాయి. 2022 సంవత్సరం నుంచి 2024 సంవత్సరం మధ్యకాలంలో భారత్‌లో 125 మంది రేబిస్‌తో చనిపోయారు. ఈ మరణాలు అత్యధికంగా సంభవించిన టాప్-10 రాష్ట్రాల్లో మహారాష్ట్ర (35), కర్ణాటక (12), మధ్యప్రదేశ్ (9), తమిళనాడు (9), ఉత్తరప్రదేశ్ (9), బిహార్ (6), మణిపూర్ (6), హిమాచల్ ప్రదేశ్ (5), మేఘాలయ (5), ఆంధ్రప్రదేశ్ (4) ఉన్నాయి. మహారాష్ట్రలో 2022లో 7, 2023లో 14, 2024లో 14 రేబిస్ మరణాలు చోటుచేసుకున్నాయి.

 

9 రాష్ట్రాలు, 5 యూటీల్లో రేబిస్ మరణాలు జీరో

2022 – 2024 మధ్యకాలంలో భారత్‌లోని 9 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒక్క రేబిస్ మరణం కూడా నమోదు కాలేదు. మిగతా రాష్ట్రాల్లో కేవలం ఒక్కో రేబిస్ మరణమే సంభవించింది. అయితే కుక్క కాటు కేసులు, రేబిస్ మరణాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలపై ప్రధాన ఫోకస్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. వీధి కుక్కల సంఖ్యను తగ్గించేందుకు దీర్ఘకాలిక వ్యూహం అవసరమని వారు అంటున్నారు. రాజ్యాంగంలోని నిబంధనలకు విఘాతం కలిగించకుండా ఈ దిశగా చర్యలను చేపట్టాలని సూచిస్తున్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram