గోల్డెన్ న్యూస్ / పాల్వంచ : గోదావరి పరీవాహక ప్రాంతంలో గంజాయి ముఠా రవాణా రోజురోజుకీ విస్తరిస్తున్నారు. తాజాగా ఒడిశా రాష్ట్రంలోని అటవీ ప్రాంతాల నుండి అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గంజాయి రవాణాను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పాల్వంచ వద్ద అడ్డుకున్నారు. ఈ దాడిలో అధికారులు మొత్తం 107 కిలోల గంజాయిను పట్టుకుని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ సుమారు రూ.53 లక్షలుగా ఉంటుందని తెలిపారు.
ఒడిశా నుండి కేరళకు గంజాయి తరలిస్తోందని సమాచారం రావడంతో ఎక్సైజ్ విభాగం ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేసింది. గురువారం తెల్లవారుజామున పాల్వంచ పరిసరాల్లో తనిఖీలు చేపట్టిన అధికారులు డీసీఎం వ్యాన్‌ను ఆపి పరిశీలించారు. అందులో గుప్తంగా దాచిన గంజాయి ప్యాకెట్లను వెలికితీశారు. అదే సమయంలో నిందితులు ఉపయోగిస్తున్న కారు కూడా స్వాధీనం చేశారు.
నిందితుల వద్ద నుంచి 107 కిలోల గంజాయి (విలువ రూ.53 లక్షలు),ఒక డీసీఎం వ్యాన్ ,ఒక కారు,ఆరు మొబైల్ ఫోన్లు ,ఆరు నైన్ ఎం.ఎం. పిస్టల్స్,పన్నెండు ఖాళీ మ్యాగజైన్స్ ,నలభై ఐదు బుల్లెట్లు ,రూ.35,500 నగదు స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు తెలిపారు.
విలేకరుల సమావేశంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడుతూ, ఈ రవాణా వెనుక పెద్ద ముఠా పని చేస్తోందని, ఆయుధాల స్వాధీనం కావడం ఆందోళన కలిగించే విషయమని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని, అంతర్రాష్ట్ర స్థాయిలో గంజాయి అక్రమ రవాణా ముఠాలను గుర్తించి అణచివేసే దిశగా చర్యలు చేపడతామని చెప్పారు.
ముగ్గురు నిందితులను కస్టడీలోకి తీసుకున్న అధికారులు, గంజాయి సరఫరా మార్గం, ఆయుధాల ఉద్దేశ్యం, ఈ రవాణా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు అన్న విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసు ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న అంతర్రాష్ట్ర గంజాయి ముఠా నెట్‌వర్క్‌ను బట్టబయలు చేసే అవకాశాలు ఉన్నాయని అధికారులు విశ్వసిస్తున్నారు.









