పింఛన్ రాదన్న భయంతో దంపతుల ఆత్మహత్య

     ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కుమార్తె..

గోల్డెన్ న్యూస్/  శ్రీకాకుళం : వచ్చే నెల నుంచి వికలాంగ పింఛను రాదన్న నోటీసు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకుంది. కుటుంబ పోషణకు ఆధారమైన పింఛను పోతుందన్న మనస్తాపంతో శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలుకు చెందిన అంధుడు కొల్లి అప్పారావు (45), ఆయన భార్య లలిత (42)తో కలిసి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఆదివారం ఉదయాన తల్లిదండ్రులు విగతజీవులుగా పడి ఉండడాన్ని చూసిన కుమార్తె దేవి, గ్లాసులో మిగిలి ఉన్న ద్రావణాన్ని తాగింది. ఆమెను స్థానికులు శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి నిలకడగా ఉంది. స్థానిక కథనం ప్రకారం… గార మండలంలోని శ్రీకూర్మంలో ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేసిన అప్పారావుకు కనుచూపు తగ్గి ఏదీ సరిగ్గా కనిపించకపోవడంతో ఉద్యోగం మానేశారు. కొన్నేళ్లుగా వికలాంగ పింఛను తీసుకుంటున్నారు. ఇటీవల పింఛన్ల పరిశీలన అనంతరం 40 శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు, పింఛనుకు అనర్హత అయినట్లు సచివాలయ అధికారులు నోటీసులు అందజేశారు. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న అప్పారావు, వచ్చే నెల నుంచి పింఛను ఆగిపోతుందని, ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమార్తె దేవి ఫీజు కూడా కట్టలేనని దిగులు చెందారు. మరోవైపు కుటుంబసభ్యులతో స్థిరాస్తి తగాదాలు కూడా ఉండడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి కుమార్తె నిద్ర పోయాక భార్య లలితతో కలిసి ఫినాయిల్‌, ఎలుకల మందు, క్లీనింగ్‌ యాసిడ్‌ కలిపి తాగారు. ఆదివారం ఉదయాన కుమార్తె దేవి నిద్ర లేచేసరికి తల్లిదండ్రులు మృతి చెంది ఉన్నారు. వారి పక్కనే గ్లాసులో కొంత ద్రావణం ఉండడంతో, దాన్ని దేవి తాగి తల్లిదండ్రుల మృతదేహాల వద్ద రోదించింది. దీంతో, అక్కడకు చేరుకున్న స్థానికులు జరిగింది తెలుసుకుని అంబులెన్స్‌లో దేవిని శ్రీకాకుళంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటోంది. శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఆస్పత్రిలో దేవిని పరామర్శించి, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అర్హుల పింఛన్ల తొలగింపు ఉండదని, అపోహలు నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

 

కుటుంబ వివాదాలే కారణం : అధికారులు

అప్పారావు, ఆయన భార్య ఆత్మహత్యకు కుటుంబ ఆస్తి వివాదాలే కారణమని, పింఛను నిలిపివేయడం వల్ల కాదని కలెక్టర్‌ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గార తహశీల్దార్‌ విచారణలో ఇదే విషయం బయటపడిందని, మృతుల కుమార్తె పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలోనూ ఇదే విషయాన్ని పేర్కొన్నారని తెలిపారు.

 

 

Facebook
WhatsApp
Twitter
Telegram