గోల్డెన్ న్యూస్ / నిజామాబాద్ : నిజామాబాద్ మెడికల్ కాలేజీలో జూనియర్ విద్యార్థిని ర్యాగింగ్ చేసిన విద్యార్థులు సస్పెన్షన్ కు గురయ్యారు. ఈ మేరకు కాలేజీ ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఐదుగురు ఇంటెన్స్ ను ఆరు నెలలపాటు సస్పెన్షన్ చేయడంతో పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనపై ప్రిన్సిపల్ అధ్యక్షతన యాంటీ ర్యాగింగ్ కమిటీ సోమవారం ఉదయం సమావేశమైన విషయం తెలిసిందే. ఘటనపై ఇరువర్గాల వాదనలను వినడంతో పాటు జుడా మెంబర్తో మాట్లాడిన అనంతరం సస్పెండ్ చేశారు. అంతేకాకుండా తదుపరి చర్యలపై పోలీస్ శాఖ సమర్పించిన నివేదిక మీద చర్యలు తీసుకోనున్నారు. యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశంలో అడిషనల్ కలెక్టర్, డీసీపీ, జీజీహెచ్ సూపరింటెండెంట్, అడిషనల్ సూపరింటెండ్, వైస్ ప్రిన్సిపల్, అకడమిక్, డ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రిన్సిపాల్, వివిధ శాఖల అధిపతులు హాజరయ్యారు.
పటాన్చెరుకు చెందిన రాహుల్ రెడ్డి ప్రస్తుతం మెడికల్ కాలేజీలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటర్నల్ డ్యూటీలో భాగంగా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో విధులు నిర్వర్తించాడు. అయితే రాహుల్ విధులకు గైర్హాజరైనట్లు సీనియర్ అయిన సాయిరాం పవన్ రిజిస్టర్లో నమోదు చేశాడు. దీనిపై ప్రశ్నించడంతో బెదిరింపులకు పాల్పడ్డాడు. అంతేగాకుండా శనివారం సాయంత్రం మాట్లాడుదామని పిలిపించి సీనియర్లు దాడి చేశారు. పలువురు విద్యార్థులు రాహుల్ను ర్యాగింగ్ చేయడంతో పాటు బెదిరించారు.
బాధిత విద్యార్థి ఫిర్యాదు మేరకు నగరంలోని వన్ టౌన్ పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. సాయిరాం పవన్, శ్రావణ్, సాత్విక్ హృదయ పాల్, అభినవ్ పెద్ది, ఆదిత్యతో పాటు పలువురు రాహుల్పై దాడి చేశారు. పోలీసులు పలు సెక్షన్లతో పాటు తెలంగాణ ర్యాగింగ్ నిషేధ చట్టం సెక్షన్ 4(1), 4(11) కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.









