వైద్య రంగంలో కీలక ముందడుగు.

♦ అతి తక్కువ ఖర్చుతో ఐఐటీ మద్రాస్  సరికొత్త ఆవిష్కరణ

♦ యాంటీబయాటిక్ నిరోధకతను గుర్తించే మైక్రోఫ్లూయిడిక్ పరికరం

♦ కేవలం 3 గంటల్లోనే ఫలితాలు వెల్లడి

♦ అతి తక్కువ ఖర్చుతో తయారీ.. చిన్న క్లినిక్‌లలోనూ అందుబాటులోకి

♦ ప్రాణాంతక ఇన్ఫెక్షన్లకు సరైన చికిత్స అందించడంలో కీలకం

♦ స్టార్టప్ ద్వారా వాణిజ్యపరంగా ఉత్పత్తికి ప్రణాళిక

 

వైద్య రంగంలో రోగ నిర్ధారణను వేగవంతం చేసే దిశగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), మద్రాస్ పరిశోధకులు ఒక కీలక ముందడుగు వేశారు. బ్యాక్టీరియాపై యాంటీబయాటిక్స్ పనిచేస్తున్నాయో లేదో (యాంటీబయాటిక్ నిరోధకత) కేవలం 3 గంటల్లోనే గుర్తించగల ఒక వినూత్నమైన, చౌకైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఈ ఆవిష్కరణ ద్వారా సరైన సమయంలో రోగులకు సరైన చికిత్స అందించడం సులభతరం కానుంది.

 

ప్రస్తుతం ప్రపంచ ఆరోగ్య వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాళ్లలో యాంటీబయాటిక్ నిరోధకత (ఏఎంఆర్) ఒకటి. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం దీనిని ప్రపంచంలోని టాప్ 10 ఆరోగ్య ముప్పులలో ఒకటిగా పేర్కొంది. సాధారణంగా, ఒక ఇన్ఫెక్షన్‌కు ఏ యాంటీబయాటిక్ సరైనదో తెలుసుకోవడానికి చేసే యాంటీబయాటిక్ ససెప్టబిలిటీ టెస్టింగ్ (ఏఎస్‌టీ)కి 48 నుంచి 72 గంటల సమయం పడుతుంది. ఈ జాప్యం వల్ల వైద్యులు కొన్నిసార్లు విస్తృత శ్రేణి యాంటీబయాటిక్స్‌ను వాడాల్సి వస్తుంది. ఇది ఏఎంఆర్ సమస్యను మరింత పెంచుతోంది.

 

దీనిని అధిగమించేందుకే ఐఐటీ మద్రాస్ బృందం ఒక పరికరాన్ని రూపొందించింది. ‘ఎలక్ట్రోకెమికల్ ఇంపిడెన్స్ స్పెక్ట్రోస్కోపీ’ అనే సాంకేతికత ఆధారంగా ఈ పరికరం పనిచేస్తుంది. ఖరీదైన లోహాలకు బదులుగా, స్క్రీన్-ప్రింటెడ్ కార్బన్ ఎలక్ట్రోడ్‌లతో కూడిన మైక్రోఫ్లూయిడిక్ చిప్‌పై ఇది పనిచేస్తుందని ఐఐటీ మద్రాస్ కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ ఎస్. పుష్పవనం తెలిపారు. ఈ విధానం వల్ల పరికరం తయారీ ఖర్చు గణనీయంగా తగ్గడమే కాకుండా, ప్రత్యేక నైపుణ్యం లేని సిబ్బంది కూడా దీనిని సులభంగా ఉపయోగించవచ్చని ఆయన వివరించారు.

 

ఈ పరికరం వేగంగా ఫలితాలు ఇవ్వడంతో పాటు, తక్కువ ఖర్చుతో కూడుకున్నది కావడంతో చిన్న క్లినిక్‌లు, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల్లో సైతం వినియోగించడానికి అనువుగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐసీయూలో చికిత్స పొందుతున్న రోగులకు ఇది ఎంతో మేలు చేస్తుందని, సరైన సమయంలో సరైన యాంటీబయాటిక్స్‌ను సూచించడం ద్వారా ప్రాణాలు కాపాడవచ్చని వారు పేర్కొన్నారు. ఈ పరిశోధన ఫలితాలు ప్రతిష్ఠాత్మక ‘నేచర్ సైంటిఫిక్ రిపోర్ట్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

 

ప్రస్తుతం ఐఐటీఎం ఇన్‌స్టిట్యూట్ హాస్పిటల్‌తో కలిసి క్లినికల్ వాలిడేషన్ చేస్తున్నామని, ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తమ స్టార్టప్ ‘కాపాన్ అనలిటిక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ ద్వారా దీనిని వాణిజ్యపరంగా మార్కెట్లోకి తీసుకురావాలని ప్రొఫెసర్ పుష్పవనం వెల్లడించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram