షుగర్ ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ డేంజర్.. అసలు కారణం ఇదేనట!

షుగర్ ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ డేంజర్.. అసలు కారణం ఇదేనట.

టైప్ 2 డయాబెటిస్, బ్రెస్ట్ క్యాన్సర్‌పై అమెరికా శాస్త్రవేత్తల కొత్త అధ్యయనం

మధుమేహం ఉన్నవారిలో క్యాన్సర్ తీవ్రతకు కారణాలు గుర్తింపు

రక్తంలోని ‘ఎక్సోజోమ్స్’ కణాల్లో మార్పులే అసలు కారణమని వెల్లడి

కణితుల్లో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తున్న ఎక్సోజోమ్స్

బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకుల కీలక ప్రయోగ ఫలితాలు

టైప్ 2 డయాబెటిస్ (మధుమేహం) ఉన్నవారిలో బ్రెస్ట్ క్యాన్సర్ ఎందుకు మరింత తీవ్రంగా, ప్రమాదకరంగా మారుతుందనే దీర్ఘకాల ప్రశ్నకు శాస్త్రవేత్తలు ఎట్టకేలకు సమాధానం కనుగొన్నారు. ఈ సమస్య వెనుక ఉన్న కీలకమైన జీవ రసాయనిక ప్రక్రియను తమ తాజా అధ్యయనంలో వెలుగులోకి తెచ్చారు. అమెరికాలోని బోస్టన్ యూనివర్సిటీ పరిశోధకులు చేసిన ఈ ఆవిష్కరణతో భవిష్యత్తులో క్యాన్సర్ చికిత్సలో కొత్త మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

 

మధుమేహం కారణంగా రక్తంలో ఉండే ‘ఎక్సోజోమ్స్’ అనే అతి సూక్ష్మమైన కణాల స్వభావం మారిపోతుందని ఈ అధ్యయనం తేల్చింది. ఇలా మార్పు చెందిన ఎక్సోజోమ్స్.. క్యాన్సర్ కణితులలోకి ప్రవేశించి, అక్కడి రోగనిరోధక కణాలను బలహీనపరుస్తున్నాయి. దీనివల్ల మన శరీరంలోని సహజ రక్షణ వ్యవస్థ క్యాన్సర్‌పై పోరాడలేకపోతోంది. ఫలితంగా క్యాన్సర్ వేగంగా పెరగడమే కాకుండా ఇతర భాగాలకు సులభంగా వ్యాపిస్తోందని పరిశోధకులు గుర్తించారు.

ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ గెరాల్డ్ డెనిస్ మాట్లాడుతూ, “బ్రెస్ట్ క్యాన్సర్ చికిత్స ఇప్పటికే చాలా సవాలుతో కూడుకుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారిలో ఫలితాలు మరింత ఆందోళనకరంగా ఉంటున్నాయి. దీనికి కారణమేంటో ఇప్పటివరకు వైద్యులకు కూడా పూర్తిగా అర్థం కాలేదు. మా అధ్యయనం ఒక ముఖ్యమైన కారణాన్ని బయటపెట్టింది. డయాబెటిస్ వల్ల కణితుల్లో రోగనిరోధక వ్యవస్థ పనిచేసే తీరు మారుతోంది. డయాబెటిస్ రోగుల్లో ఇమ్యునోథెరపీ వంటి చికిత్సలు ఎందుకు సరిగా పనిచేయవో వివరించడానికి ఇది సహాయపడుతుంది. ఈ సమాచారంతో లక్షలాది మందికి మెరుగైన చికిత్సలు అందించేందుకు మార్గం సుగమం అవుతుంది” అని ఆయన వివరించారు.

 

పరిశోధన కోసం శాస్త్రవేత్తలు బ్రెస్ట్ క్యాన్సర్ రోగుల నుంచి కణితి నమూనాలను సేకరించి, ల్యాబ్‌లో 3డీ ట్యూమర్ మోడల్స్‌ను (ఆర్గానాయిడ్స్) అభివృద్ధి చేశారు. అనంతరం డయాబెటిస్ ఉన్న, లేని వ్యక్తుల నుంచి సేకరించిన ఎక్సోజోమ్స్‌తో ఈ ట్యూమర్ మోడల్స్‌కు చికిత్స చేసి, వాటిపై ప్రభావాన్ని విశ్లేషించారు. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారి ఎక్సోజోమ్స్, బ్రెస్ట్ క్యాన్సర్ కణితుల్లోని రోగనిరోధక శక్తిని అణిచివేస్తున్నాయని ప్రత్యక్షంగా నిరూపించడం ఇదే మొదటిసారని డెనిస్ స్పష్టం చేశారు. ఈ అధ్యయన ఫలితాలు కేవలం బ్రెస్ట్ క్యాన్సర్‌కే కాకుండా రోగనిరోధక శక్తి తగ్గిన ఇతర క్యాన్సర్లకు కూడా వర్తించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు

Facebook
WhatsApp
Twitter
Telegram