కాళేశ్వరం నివేదికపై మళ్లీ హైకోర్టుకు

మధ్యంతర అప్లికేషన్‌ దాఖలు చేసే యోచనలో బీఆర్‌ఎస్‌ 

అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు కేసీఆర్‌ హాజరుపై సందిగ్ధం 

ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో మాజీ మంత్రి హరీశ్‌రావు భేటీ

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం కేవియట్‌ పిటిషన్‌ వేసినట్లు సమాచారం

 

హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్‌ పార్టీ.. మరోమారు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని భావిస్తోంది. కమిషన్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించిన ఆ పారీ్ట.. మరోమారు మధ్యంతర అప్లికేషన్‌ (ఐఏ)ను దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం హైకోర్టుకు వెళ్లేందుకు బీఆర్‌ఎస్‌ సన్నాహాలు చేస్తోంది.

 

శనివారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో శుక్రవారం ఎర్రవల్లి నివాసంలో పార్టీ అధినేత కేసీఆర్‌ కీలక నేతలతో సమావేశమయ్యారు. ఈ భేటీలో అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంతోపాటు పీసీ ఘోష్‌ కమిషన్‌పై కోర్టుకు వెళ్లే అంశంపై కేసీఆర్‌ పలు సూచనలు చేసినట్లు తెలిసింది.

 

హైకోర్టులో మధ్యంతర అప్లికేషన్‌

 

విచారణకు రాకమునుపే అసెంబ్లీలో ఘోష్‌ కమిషన్‌ నివేదికను పెట్టేందుకు రేవంత్‌ ప్రభుత్వం ఆదివారం కూడా అసెంబ్లీని నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు ఈ భేటీలో అభిప్రాయం వ్యక్తమైంది. ఒకవేళ అసెంబ్లీలో నివేదికను ప్రవేశ పెడితే వినిపించాల్సిన వాదనపై ఇప్పటికే హరీశ్‌రావు పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్లు సమాచారం.

 

అయితే, అసెంబ్లీలో చర్చకు కేసీఆర్‌ హాజరు కాకపోవటమే మంచిదని పార్టీ నేతలు చెప్పినట్లు తెలిసింది. అసెంబ్లీలో చోటు చేసుకునే పరిణామాల ఆధారంగా కేసీఆర్‌ హాజరయ్యేదీ లేనిదీ తెలుస్తుందని బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.

 

సుప్రీంకోర్టులో కేవియట్‌ పిటిషన్‌!

పీసీ ఘోష్‌ కమిషన్‌ను కొట్టేయడం లేదా స్టే కోసం బీఆర్‌ఎస్‌ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించే అవకాశం ఉందన్న సమాచారంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే కేవియట్‌ దాఖలు చేసినట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు వినకుండా ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఆ కేవియట్‌లో కోరినట్లు సమాచారం. బీఆర్‌ఎస్‌ పిటిషన్‌ దాఖలు చేస్తే… ప్రభుత్వం తరఫున పూర్తిస్థాయిలో వాదనలు వినిపిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది.

 

వారి సభ్యత్వంపై సందిగ్ధం

గవర్నర్‌ కోటాలో గతేడాది ఆగస్టు 16న ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేసిన ప్రొ. కోదండరాం, ఆమేర్‌ అలీఖాన్‌లు శనివారం నుంచి మండలి సమావేశాలకు హాజరు అవుతారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వీరిద్దరి సభ్యత్వాలను రద్దుచేస్తూ సుప్రీంకోర్టు ఈ నెల 13న మధ్యంతర ఉత్తర్వులిచ్చిన విషయం తెలిసిందే. సుప్రీం ఉత్తర్వులను పరిశీలించే బాధ్యతను ప్రభుత్వం న్యాయశాఖకు, అడ్వొకేట్‌ జనరల్‌కు అప్పగించింది. ఇప్పటివరకు ఈ 2 స్థానాలు ఖాళీ అయినట్లు మండలి చైర్మన్‌ ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అమలు చేస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.

Facebook
WhatsApp
Twitter
Telegram