గోల్డెన్ న్యూస్ /ఆంధ్ర ప్రదేశ్ : టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ట్రెండ్ మార్చారా? ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రజలతో మమేకం అవుతున్నారా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. గతంలో 2014-19 మధ్య కూడా ఆయన ప్రజల మధ్య తిరిగారు. కానీ, భద్రతా పరమైన కారణాలు లేదా.. పాలనా పరమైన ఒత్తిడి నేపథ్యంలో ఆయన ఎక్కడికి వెళ్లినా.. అక్కడి పనులు చూసుకుని వెనుదిరిగేవారు. ప్రజలతో కేవలం ముచ్చట్ల వరకే పరిమితం అయ్యేవారు. కానీ, ఈ ఏడు పరిస్థితిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.
ప్రజలతో ఇంటరాక్షన్‌కు సీఎం చంద్రబాబు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. వారితో కలిసి, వారి పక్కన కూర్చుని.. వారితో ముచ్చటించేందుకు ప్రయత్నిస్తున్నారు. తద్వారా.. సీఎం అల్లా `మన సీఎం` అనుకునే స్థాయిలో ఆయన అందరితోనూ కలివిడిగా ఉంటున్నారు. ప్రతి నెలా 1వ తారీకున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటున్నారు. నిర్ణీత ప్రాంతాన్ని ఎంచుకుని.. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి.. వారితో ముచ్చటించి కష్టసుఖాలు తెలుసుకుంటున్నారు. వారితో కలిసి టీ, కాఫీలు తాగుతున్నారు.
ఇది సీఎం చంద్రబాబును పేదలకు, ప్రజలకు కూడా చేరువ చేసింది. ఇక, ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పించిన తర్వాత.. మరింత ఎక్కువగా ఇంటరాక్షన్ కల్పిస్తున్నారు. ఏపనిమీద ఎక్కడికి వెళ్లినా.. ఆర్టీసీ బస్సు ఎక్కి, మహిళలతో మమేకం అవుతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, పాలన, పెట్టుబడులపై వారి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. ఇదేసమయంలో తన విజన్‌ను నేరుగా వారికి పక్కన కూర్చోబెట్టుకుని వివరిస్తున్నారు.
శుక్రవారం విశాఖపట్నంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రారంభించిన తర్వాత.. ఆ బస్సులో ఎక్కి.. ప్రయాణికులతో కలిసి నాలుగు కిలో మీటర్లు ప్రయాణించారు. విశాఖలో జరుగుతున్న అభివృద్ధి, ఆర్థిక రాజధాని గా తాను చేయాలని అనుకుంటున్న డెవలప్‌మెంటులపై వారితో చర్చించారు. వారి నుంచి అభిప్రాయాలు తెలుసుకున్నారు. తాజాగా కుప్పంలో పర్యటించినప్పుడు కూడా స్థానిక ఆర్టీసీ బస్సు ఎక్కి.. ప్రయాణికులతో మమేకమయ్యారు. మహిళలు, రైతులతో కలిసి కుప్పం బ్రాంచ్ కెనాల్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రభుత్వ పనితీరు, అభివృద్ధి, సమస్యలపై నేరుగా వారిని అడిగి తెలుసుకున్నారు. తద్వారా.. ప్రజా సీఎంగా.. మన సీఎంగా ప్రజల మనసులో ముద్ర వేసుకునేదిశగా చంద్రబాబు అడుగులు వేస్తున్నారన్న చర్చ సాగుతోంది.









