10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ సంస్థలలో 44 మందిపేర్లపై 142 గోల్డ్ లోన్లు.44 మందికి కేసు నమోదు, 15.23 కిలోల బంగారం రికవరీ…
గోల్డెన్ న్యూస్ /మంచిర్యాల : మంచిర్యాల జిల్లా చెన్నూర్ పట్టణంలో ఎస్బీఐ బ్రాంచ్‌లో వెలుగులోకి వచ్చిన భారీ బంగారు ఆభరణాల మోసం కేసు జిల్లాలో సంచలనం రేపింది. కోట్ల రూపాయల విలువైన గోల్డ్ లోన్ ఆభరణాలు మరియు నగదు మాయమైన విషయం బయటపడటంతో పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేపట్టి 44 మందిని అరెస్ట్ చేశారు. వీరిలో ముగ్గురు బ్యాంకు ఉద్యోగులు కూడా ఉండటం మరింత కలకలం రేపింది.2025 ఆగస్టు 23వ తేదీ ఉదయం ఎస్బీఐ రీజినల్ మేనేజర్ రితేష్ కుమార్ గుప్తా చెన్నూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వివరాల ప్రకారం బ్యాంకులో 402 గోల్డ్ లోన్ ఖాతాల ఆభరణాలు, దాదాపు 25.17 కిలోల బంగారం (విలువ రూ.12.61 కోట్లు) మరియు రూ.1.10 కోట్లు నగదు దుర్వినియోగం చేయబడ్డాయి. ఈ ఫిర్యాదు అందుకున్న వెంటనే రామగుండం పోలీస్ కమిషనర్ ఏ. భాస్కర్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.ప్రాథమిక దర్యాప్తులోనే క్యాషియర్ నరిగె రవీందర్ ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలు బహిర్గతమయ్యాయి. అదుపులోకి తీసుకున్న రవీందర్ విచారణలో క్రికెట్ బెట్టింగ్‌లో రూ.40 లక్షలు నష్టపోయిన తర్వాత మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌తో కుమ్మక్కై మోసానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. బ్యాంక్ కరెన్సీ ఛెస్ట్ తాళాలు మేనేజర్ నుంచి పొందిన రవీందర్ బంగారం, నగదు దొంగిలించి తన పరిచయస్తుల సహకారంతో ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల్లో తాకట్టు పెట్టేవాడు.దీని ఫలితంగా 10 ప్రైవేట్ గోల్డ్ లెండింగ్ సంస్థలలో 44 మందిపేర్లపై 142 గోల్డ్ లోన్లు తీసుకున్నట్లు విచారణలో బయటపడింది. అంతేకాకుండా తప్పుడు గోల్డ్ లోన్లు కూడా మంజూరు చేసి రూ.1.58 కోట్లు విత్‌డ్రా చేసినట్లు పోలీసుల దర్యాప్తు తేల్చింది. మొత్తం 21 కిలోల బంగారం విలువైన నష్టం జరిగినట్లు అంచనా.దర్యాప్తు బృందాలు ఇప్పటివరకు 15.23 కిలోల బంగారం, రూ.1,61,730 నగదు స్వాధీనం చేసుకున్నాయి. మిగిలిన ఆభరణాలు ముత్తూట్, మణప్పురం, గోదావరి అర్బన్ వంటి సంస్థల వద్ద ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వీటిని కూడా రాబట్టే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. నిందితులలో ఎస్బీఐ బ్రాంచ్ క్యాషియర్ నరిగె రవీందర్, బ్రాంచ్ మేనేజర్ వెన్నపురెడ్డి మనోహర్, అవుట్సోర్సింగ్ ఉద్యోగి లక్కాకుల సందీప్‌లతో పాటు ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల మేనేజర్లు, సిబ్బంది, స్థానికులు ఉన్నారు. మొత్తం 44 మంది అరెస్టు కాగా, ఇద్దరు పరారీలో ఉన్నట్లు సమాచారం.ఈ కేసును స్వల్పకాలంలోనే ఛేదించినందుకు దర్యాప్తు బృందాలను కమిషనర్ ఏ. భాస్కర్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ ఘటనతో చెన్నూర్ పట్టణంలో కలకలం రేగగా, బ్యాంకింగ్ రంగంలోనూ భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.









