నిజాయతీ చాటుకున్న ఆటో డ్రైవర్.

గోల్డెన్ న్యూస్ / నిర్మల్ : పట్టణం నడిరోడ్డుపై తనకు దొరికిన రూ. 16 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, విలువైన పత్రాలు ఉన్న సంచిని.. దాన్ని పోగొట్టుకున్న వారికి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు ఓ ఆటో డ్రైవర్. నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందిన సుజాత నిర్మల్లో ఆరోగ్యమిత్రగా విధులు నిర్వహిస్తున్నారు. ఆమె శనివారం సాయంత్రం కుమారుడితో కలిసి నిర్మల్ నుంచి ఖానాపూర్ వైపు ద్విచక్రవాహనంపై వెళుతుండగా.కొండాపూర్ సమీపంలోని బైపాస్ వద్ద కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలతో పాటు కొంత నగదు, గుర్తింపు పత్రాలతో కూడిన సంచిని  పడిపోవడాన్ని వారు గమనించలేదు.

ఆ సమయంలో లక్ష్మణచాంద మండలం రాచాపూర్  గ్రామానికి చెందిన డ్రైవర్ సాయికుమార్ తన ఆటోలో  ప్రయాణికులతో నిర్మల్ నుంచి కనకాపూర్ వైపు వెళ్తుండగా వడ్యాల్ గ్రామానికి చెందిన సౌజన్య (ప్రయాణికురాలు) రోడ్డుపై పడి ఉన్న సంచిని గమనించి డ్రైవర్కు తెలిపారు. సాయికుమార్ దాన్ని తీసుకుని ఇంటికి తీసుకెళ్లారు. బంగారంతో కూడిన సంచి పోయిందని సామాజిక మాధ్యమాల్లో సందేశాన్ని చూసిన సౌజన్య తన భర్త ద్వారా ఆటోడ్రైవర్ సాయికుమార్కు విషయాన్ని తెలియజేసింది. ఆదివారం బాధితులకు సమాచారం చేరవేయటంతో వారు వచ్చారు. బంగారం, నగదు, గుర్తింపు పత్రాలను బాధితురాలు సుజాతకు సాయికుమార్ అందజేశారు. నిజాయితీకి మెచ్చుకున్న గ్రామస్థులు ఆటో డ్రైవర్ ను ఘనంగా సన్మానించి అభినందించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram