విద్యుత్‌శాఖ ఏడీఈ అంబేడ్కర్ ఇళ్లలో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు
అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో సోదాలు
మణికొండ, గచ్చిబౌలి, మాదాపూర్ సహా 15 చోట్ల ఏసీబీ సోదాలు
అవినీతి నిరోధక శాఖ వలకు మంగళవారం భారీ తిమింగళం చిక్కింది. తెలంగాణ విద్యుత్ శాఖలో ఏడీఈ అంబేడ్కర్ బంధువు సతీష్ నివాసంలో ఇంట్లో ఏసీబీ అధికారులు రూ.2 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అంబేడ్కర్ కొండాపూర్‌లోని మేఘన లేక్ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఈయనపై అనేక అవినీతి ఆరోపణలున్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది.
వందల కోట్లు కూడబెట్టారని ఫిర్యాదులు :
ఏడీఈ అంబేడ్కర్ భారీగానే వందల కోట్ల ఆస్తులు కూడగట్టినట్లు ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఇబ్రహీంబాగ్ ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ నివాసంలో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా అవినీతి, ఆదాయానికి మించిన ఆస్తుల ఆరోపణలపై ఈ సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, నల్గొండ, మెదక్ జిల్లాల్లోని ఆయన బంధువులు, కుటుంబసభ్యులు, స్నేహితుల నివాసాల్లో మొత్తం 12 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
గచ్చిబౌలిలో ఖరీదైన భవనం :
ఇప్పటివరకు హైదరాబాద్లో 3 ప్లాట్లు, గచ్చిబౌలిలో ఖరీదైన భవనం, సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్ శివారులో వెయ్యి గజాల్లో వ్యవసాయ క్షేత్రం (ఫార్మ్హౌస్) గుర్తించినట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపారు.
రాత్రి వరకూ సోదాలు:
ఈ సోదాల్లో మరిన్ని ఆస్తులకు సంబంధించిన వివరాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు చెప్పారు. ఏసీబీ అంబేడ్కర్ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో మమ్మరంగా సోదాలు చేస్తోంది. ఈరోజు రాత్రి వరకు కొనసాగే అవకాశం ఉంది. అయితే విద్యుత్ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. అంబేడ్కర్ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ తెలిపింది.









