జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవడం ఖాయం : మంత్రి ప్రభాకర్

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ఉద్ఘాటించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ అధికార కాంగ్రెస్‌ని గెలిపించాలని కోరారు. సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల మాదిరిగా తమ ప్రభుత్వం పని చేస్తోందని వ్యాఖ్యానించారు. ఇవాళ(శనివారం) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. ఎర్రగడ్డ డివిజన్‌లో రూ.2.16 లక్షలతో సీసీ రోడ్లకు, కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన చేశామని తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్.

 

రూ.54 లక్షలతో మురుగు నీటి కాలువల పునరుద్ధరణకు శంకుస్థాపన చేశామని వెల్లడించారు. దీని పక్కన ఉన్న స్థలంలో ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్క్ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. రేపటి నుంచి పనులు ప్రారంభం అవుతాయని తెలిపారు. వాకింగ్ ట్రాక్, పిల్లల గేమ్స్ ఆడుకోవడానికి, తదితర ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు మంత్రి పొన్నం ప్రభాకర్.

 

హైదరాబాద్‌లో 60 వేలకు పైగా నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామని గుర్తుచేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ , రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామని స్పష్టం చేశారు. కొంత మంది పిల్లలను తీసుకొచ్చి సానుభూతితో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు అడగాలని చూస్తున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి మాత్రమే ప్రజలు పట్టం కడతారని ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్‌ని అభివృద్ధి చేసే బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీసుకున్నారని నొక్కిచెప్పారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో అధికార కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని కోరారు. ఇక్కడ కూడా డబుల్ బెడ్ రూం ఇళ్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. తమ ప్రభుత్వంలో ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram