కొత్త అల్లుడికి దసరాకు 101 వంటకాలతో భోజనం..

ఒక్క వంటకం తగ్గింది.. తులం బంగారం దక్కింది..

గోల్డెన్ న్యూస్ /వనపర్తి : పండగకు ఇంటికొచ్చే కొత్త అల్లుడికి రాజమర్యాదలు చేయాలని అత్తమామలు అనుకోవడం సహజం. తెలంగాణకు చెందిన ఓ దంపతులు కూడా సరిగ్గా ఇలాగే అనుకున్నారు. దసరాకు ఇంటికొచ్చిన అల్లుడికి ఏకంగా 101 వంటకాలతో పసందైన భోజనం వడ్డించాలనుకున్నారు. ఈ క్రమంలో జరిగిన చిన్న ట్విస్ట్ కారణంగా అల్లుడికి వారు తులం బంగారం కూడా ఇచ్చుకోవాల్సి వచ్చింది. అద్భుతమైన ఆతిథ్యంతో పాటు బంగారం కూడా దక్కడంతో ఆ అల్లుడి ఆనందానికి అంతే లేకుండా పోయింది. వనపర్తి జిల్లా కొత్తకోట పురపాలికలో ఈ ఘటన జరిగింది.

 

స్థానికంగా ఉంటున్న గుంత సురేశ్, సహనల కుమార్తె సింధు వివాహం తిరుపతిలో జరిగింది. పెళ్లి తరువాత వచ్చిన దసరా తొలి పండగ కావడంతో అల్లుడు నిఖిత్‌ను ఇంటికి పిలిచారు. అతడికి తెలంగాణ సంప్రదాయ వంటకాలైన 30 రకాల పిండి వంటలు, 60 రకాల స్వీట్లు, అన్నంతో కలిపి భోజనాన్ని వడ్డించారు. ఇది చూసి నిఖిత్ కూడా ఆశ్చర్యపోయారు. అయితే, 101 రకాలలో ఒక్కటి తగ్గినా ఏమిస్తారని అత్తమామల్ని అతడు సరదాగా అడిగారు. ఒక్కటి తగ్గినా తులం బంగారం ఇస్తామని వారు ధీమాగా చెప్పారు. ఈ క్రమంలో నిఖిత్ ఒకటికి రెండు సార్లు లెక్క పెట్టి చూడగా వంద వంటకాలే కనిపించాయి. దీంతో, అత్తమామలు అన్న మాట ప్రకారం తులం బంగారం అల్లుడికి ఇచ్చారు. జీవితంలో ఎన్నడూ మర్చిపోలేని ఆతిథ్యంతో పాటు ఇలా తులం బంగారం కూడా దక్కడంతో నిఖిత్ తెగ సంబరపడ్డారు..

Facebook
WhatsApp
Twitter
Telegram