బీహార్ ఓటమిని ప్రధాని మోదీ ముందే అంగీకరించారు.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

బీహార్‌ ఎన్నికల్లో మహాగట్బంధన్‌దే విజయం

నితీశ్ కుమార్ పాలన అన్ని రంగాల్లో విఫలం

నిరుద్యోగంతో యువత వలసబాట పట్టారు

బీజేపీ-జేడీయూ పొత్తు కేవలం అధికారం కోసమే

కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌లో పాల్గొన్న పొంగులేటి

 

బీహార్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలతో కూడిన ‘మహాగట్బంధన్’ కూటమి ఘన విజయం సాధించడం ఖాయమని తెలంగాణ మంత్రి, కాంగ్రెస్ బీహార్ ఎన్నికల పరిశీలకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని, ఈసారి ప్రజలు ఆ కూటమిని తిరస్కరించడం ఖాయమని జోస్యం చెప్పారు.

 

నిన్న ఆయన పశ్చిమ చంపారన్ జిల్లాలోని నూతన్ అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ మహకూటమి తరఫున పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి అమిత్ గిరి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, నితీశ్-బీజేపీ ప్రభుత్వం మాటలకే పరిమితమైందని, వారిది అసమర్థ పాలన అని విమర్శించారు. రాష్ట్రంలో పెరిగిపోయిన నిరుద్యోగం వల్ల యువత తీవ్ర నిరాశలో ఉందని, ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. “దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బీహార్ యువకులే కనిపించడానికి ఇదే కారణం. ఇది వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే” అని అన్నారు.

 

ఇటీవల ప్రధాని మోదీ మహిళలకు తాయిలాలు ప్రకటించడం చూస్తే, వారు తమ ఓటమిని ముందే అంగీకరించినట్లు స్పష్టమవుతోందని పొంగులేటి ఎద్దేవా చేశారు. బీజేపీ-జేడీయూ పొత్తు కేవలం అధికారం పంచుకోవడం కోసమే తప్ప, ప్రజల సంక్షేమం కోసం కాదని ఆరోపించారు. సీఎం నితీశ్‌కుమార్‌ నీతిబాహ్య రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శించారు.

 

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే బీహార్ ప్రజలను చైతన్యపరిచారని, రాష్ట్రంలో జరిగిన ఓట్ల కుంభకోణాన్ని ప్రజల ముందు ఉంచి మహాగట్బంధన్ విజయానికి బాటలు వేశారని తెలిపారు. నామినేషన్ కార్యక్రమానికి ముందు ఆయన పట్నాలోని కాంగ్రెస్ వార్ రూంలో స్థానిక నేతలతో సమావేశమై ఎన్నికల వ్యూహంపై చర్చించారు.

Facebook
WhatsApp
Twitter
Telegram