నల్లగొండ జిల్లాలో పండుగ పూట దారుణం చోటుచేసుకుంది. కొండమల్లే శివారులోని వైట్ మార్కెట్ వద్ద ఓ తల్లి తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి.. తాను ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే… మృతులు బాపట్ల జిల్లా జనకవరం గ్రామానికి చెందిన కుంచాల నాగ లక్ష్మి (27), ఆమె కుమార్తె అవంతిక (9), కుమారుడు భవన్ సాయి (7)గా పోలీసులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో భాగంగా కుటుంబ కలహాల కారణంగా తల్లి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నాగలక్ష్మి ముందుగా తన ఇద్దరు పిల్లలను హత్య చేసి, తర్వాత తాను కూడా బలవన్మరణానికి పాల్పడి ఉంటుందని భావిస్తున్నారు.
ఈ ఘటనతో జనకవరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందడంతో బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు గల పూర్తి కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు. మృత దేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.









