జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు… ముగిసిన నామినేషన్ల పరిశీలన.

ఎన్నింటికి ఆమోదం లభించిందంటే..

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నామినేషన్ల దాఖలుకు మంగళవారంతో గడువు ముగియగా… 321 నామినేషన్లు దాఖలయ్యాయి.

 

మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు దాఖలు చేశారు. ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు, ఆర్‌ఆర్‌ఆర్‌ భూసేకరణలో భూములు కోల్పోనున్నవారు, నిరుద్యోగ జేఏసీ, మాలసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేయడంతో ఈ స్థాయిలో నామినేషన్లు వచ్చాయి. ఇక, ఎన్నికల అధికారులు బుధవారం ఉదయం 11 గంటల నామినేషన్ల పరిశీలన ప్రారంభించగా… భారీగా నామినేషన్లు దాఖలు అయిన నేపథ్యంలో ఈ ప్రక్రియ చాలా సమయం తీసుకుంది. అయితే 321 నామినేషన్లను పరిశీలించిన అధికారులు… 135 నామినేషన్లు ఆమోదించగా, 186 నామినేషన్లను తిరస్కరించారు.

 

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల పరిశీలన తర్వాత… 81 మంది అభ్యర్థులు దాఖలు చేసిన 135 నామినేషన్లను ఆమోదం తెలిపినట్టుగా ఎన్నికల సంఘం వెల్లడించింది. వివిధ కారణాల చే 130 మంది అభ్యర్థులు వేసిన 186 నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. అయితే ఈ ప్రకారం… ప్రస్తుతం 81 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నట్టుగా లెక్క. అయితే నామినేషన్ల విత్ డ్రా చేసుకునేందుకు శుక్రవారం (అక్టోబర్ 24) వరకు సమయం ఉంది. నామినేషన్ల విత్ డ్రా గడువు ముగిసిన తర్వాత చివరగా బరిలో నిలిచిన అభ్యర్థుల పేర్లను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.

 

ప్రధాన పార్టీల అభ్యర్థులు నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్), లంకల దీపక్ రెడ్డి (బీజేపీ) నామినేషన్లను ఎన్నికల అధికారులు ఆమోదించారు. ఇందులో నవీన్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్ దాఖలు చేయగా, మాగంటి సునీత నాలుగు సెట్లు, దీపక్ రెడ్డి నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్లు ఆమోదం పొందడంతో అభ్యర్థులు తమ ప్రచారాన్ని మరింత ముమ్మురం చేయనున్నారు.

 

ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు అవకాశం ఉంది. ఆ తర్వాత జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించనున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నవంబర్ 11న జరగనుండగా, నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram