మహబూబాబాద్ ప్రభుత్వాసుపత్రిలో అమానుషం
గోల్డెన్ న్యూస్ / మహబూబాబాద్: ఓ రోగి బతికుండగానే మార్చురీకి తరలించిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిలో కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే.. చిన్నగూడూరు మండలం జయ్యారం గ్రామానికి చెందిన రాజు అనే ట్రాక్టర్ డ్రైవర్ కాళ్ల నొప్పులు, కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఐదు రోజుల క్రితం ఆసుపత్రికి వచ్చాడు. ఆధార్, అటెండెంట్ ఉంటేనే ఆస్పత్రిలో చేర్చుకుంటామని సిబ్బంది చెప్పారు. దీంతో రెండ్రోజులుగా ఆస్పత్రి ఆవరణలోనే ఉంటున్నాడు. చికిత్స అందకపోవడంతో నీరసించి మార్చురీ గది ముందు పడుకున్న అతడిని.. అయితే అతడు సజీవంగా ఉన్నాడనేది గమనించకుండానే సిబ్బంది మార్చురీ వరండాలో స్ట్రెచర్ పై పడుకోబెట్టి తాళం వేశారు. శరీర కదలికలు గమనించిన పారిశుద్ధ్య సిబ్బంది.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆస్పత్రిలో అతడికి వైద్యం చేయించారు. ప్రస్తుతం రోగి క్షేమంగానే ఉన్నట్టు సమాచారం .. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఆర్ఎంవో వెల్లడించారు.









