రాష్ట్ర, జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

గోల్డెన్ న్యూస్ / పినపాక : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో నవంబర్ 8, 9 మరియు 10 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి బాలబాలికల అండర్-17 కబడ్డీ పోటీలు, అలాగే జనవరి నెలలో నిర్వహించనున్న జాతీయస్థాయి బాలుర కబడ్డీ పోటీలకు సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదివారం పరిశీలించారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ పినపాక జెడ్పీహెచ్‌ఎస్ హైస్కూల్ ఆవరణలో కబడ్డీ పోటీల నిర్వహణకు చేపడుతున్న ప్రాంగణ నిర్మాణం, కోర్టుల స్థల వ్యవస్థాపన, వసతి, భద్రతా చర్యలు మరియు మౌలిక సదుపాయాల ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించి, పలు సూచనలు చేశారు.

 

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయిలో జరగబోయే ఈ కబడ్డీ పోటీలు భవిష్యత్తులో జాతీయస్థాయి పోటీలకు వేదికగా మారబోతున్నాయి. కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతిష్టకు తగ్గట్టుగా ఈ కార్యక్రమాలు అత్యుత్తమ ప్రమాణాలతో నిర్వహించాలి అని పేర్కొన్నారు.

 

దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి క్రీడాకారులు, అధికారులు మరియు వీక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొనే అవకాశమున్నందున సదుపాయాల విషయంలో ఎటువంటి లోపాలు ఉండకుండా పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.

 

కబడ్డీ పోటీల నిర్వహణకు మొత్తం నాలుగు కోర్టులను ఏర్పాటు చేయాలని, కానీ వీక్షకుల రాకపోకలకు ఆటంకం కలగకుండా ట్రాఫిక్ కంట్రోల్ దృష్ట్యా కోర్టులను సముచిత దూరంలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీ గోడను తాత్కాలికంగా తొలగించి పక్కనే ఉన్న అటవీ శాఖ నర్సరీ ప్రదేశాన్ని వినియోగించడం ద్వారా స్థలం విస్తరించి, పోటీలు సౌకర్యవంతంగా నిర్వహించగలమని ఆయన సూచించారు.

 

గ్రౌండింగ్ కోసం గ్రావెల్‌ను తక్షణమే సమకూర్చి పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. విద్యుత్, నీటి సరఫరా, శానిటేషన్, ఆరోగ్య శిబిరం, ఫస్ట్ ఎయిడ్ సదుపాయాలు, పార్కింగ్ స్థలాలు, వాహనాల రాకపోకల నియంత్రణ, భద్రతా సిబ్బంది నియామకం వంటి అంశాలపై ప్రతి శాఖ సమన్వయంతో సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు.

 

జిల్లా యువజన సర్వీసులు మరియు క్రీడా శాఖ, విద్యాశాఖ, పోలీసు శాఖ, పంచాయతీ రాజ్, విద్యుత్, అటవీ మరియు ఆరోగ్య శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు సమయానుకూలంగా పూర్తిచేయాలని కలెక్టర్ ఆదేశించారు.

 

ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట ఎంపీ ఓ వెంకటేశ్వర్లు, విద్యుత్ శాఖ ఏ ఈ మరియు సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram