తమిళనాడులో వేల సంవత్సరాల నాటి చరిత్ర… బంగారు కాంతులతో వెలుగులీనింది! ఒక పురాతన ఆలయం తన గర్భంలో దాచుకున్న అపురూప రహస్యం ఇప్పుడు బయటపడింది. అవి కేవలం నాణేలు కావు… చరిత్ర పటాన్ని మార్చిన ఓ సామ్రాజ్య సజీవ సాక్ష్యాలు! మరి ఇన్నాళ్లు కాలం దాచిన ఈ స్వర్ణ గని వెనుక ఉన్న రాజులెవరు? పురావస్తు శాఖ అధ్యయనంలో ఏం తేలింది..?
వేల సంవత్సరాల నాటి చరిత్ర బంగారు కాంతులతో కళ్ల ముందు నిలిచింది. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా, జవ్వాదుమలై కొండల్లోని ఒక శిథిలమైన పురాతన శివాలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతుండగా.. బంగారు నాణేలు బయటపడ్డాయి. సమాచారం అందుకున్న పురావస్తు శాఖాధికారులు ఘటనాస్థలానికి చేరుకుని నాణేలను స్వాధీనం చేసుకున్నారు. ఇవి కేవలం నాణేలు కావు.. దక్షిణ భారతదేశ చోళ సామ్రాజ్య చరిత్ర వైభవానికి సజీవ సాక్ష్యమని చెబుతున్నారు.
దక్షిణ భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజవంశాల్లో చోళులు ముఖ్యులు. వారి కాలంలో కళ, దేవాలయ వాస్తు, ఆర్థిక వ్యవస్థలు అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెందాయి. ఈ నేపథ్యంలో, జవ్వాదుమలై కొండల్లో వెలికితీసిన ఈ నాణేలు ఆనాటి వాణిజ్య సంబంధాలు, ఆర్థిక పరిస్థితులు, ఆలయాల నిర్వహణ గురించి కొత్త కోణాలను ఆవిష్కరిస్తాయని పురావస్తు నిపుణులు విశ్వసిస్తున్నారు. పురావస్తు శాఖ ప్రస్తుతం ఈ నాణేల ముద్రణా విధానం, చిహ్నాలు, లిపి, ఆ నాణెంపై ఉన్న బొమ్మలపై లోతైన విశ్లేషణలు చేపట్టింది. ఈ పరిశోధనలతో ఈ నాణేలు ఏ రాజు కాలం నాటివి, వాటి వయసు ఎంతో తెలిసే అవకాశం ఉందని చెబుతున్నారు నిపుణులు.
యుద్ధాల సమయంలో సంపద ఆక్రమణకు గురి కాకుండా భద్రత కోసం ఈ ఆలయంలో దాచి ఉండవచ్చని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. తమ గ్రామానికి ఇంతటి చారిత్రక ప్రాధాన్యం ఉందని ఊహించలేదని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఆలయాన్ని పురావస్తు శాఖ అధికారులు తమ ఆదీనంలోకి తీసుకొని.. పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. ఈ ఆలయ పరిసరాల్లోనే కాక, సమీప గ్రామాల్లో కూడా తమ పరిశోధనలను విస్తరించాలని నిర్ణయించింది. ఈ ప్రాంత చరిత్రకు సంబంధించిన మరిన్ని కీలక ఆధారాలు లభిస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.









