గోల్డెన్ న్యూస్ /హదరాబాద్ : మందు బాబులకు బ్యాడ్ న్యూస్.. 4 రోజులు పాటు వైన్స్‌లు బంద్!.. ఎందుకంటే?: మద్యం ప్రియులకు ఇదో బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి, ఎందుకంటే నాలుగు రోజుల పాటు మద్యం షాపులు మూతబడనున్నాయి. రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్, బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు అన్ని నాలుగు రోజులపాటు మూతబడనున్నాయి.
జూబ్లీహిల్స్‌లో ఉపఎన్నికల వేళ కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. ఈనెల 11న పోలింగ్ జరగనుండగా, ఎన్నికల నిబంధనల ప్రకారం ఆ నియోజకవర్గంలో మద్యం అమ్మకాలపై తాత్కాలిక ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వివరాల్లోకి వెళితే నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని అన్ని వైన్స్, బార్లు, మద్యం షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్‌లు (స్టార్ హోటళ్లలోని బార్‌లు, రిజిస్టర్డ్ క్లబ్‌లతో సహా)పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. ఈ ఆంక్షలు నవంబర్ 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి. పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి మాత్రమే మద్యం విక్రయాలను తిరిగి అనుమతించనున్నారు అధికారులు.
ఇక నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుండటంతో ఆ రోజున కూడా మద్యం విక్రయాలపై నిషేధం విధించనున్నారు. మొత్తం మీద పోలింగ్‌కు ముందు, పోలింగ్ రోజు, లెక్కింపు రోజు.. ఈ మూడు దశల్లో జూబ్లీహిల్స్‌లో మద్యం దుకాణాలు తాత్కాలికంగా బంద్ కానున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా.. ప్రశాంత వాతావరణం నెలకొనేలా ఈ చర్యలు తీసుకున్నట్లు ఎక్సైజ్ శాఖ తెలిపింది.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రక్రియ నవంబర్ 16నాటికి పూర్తికానుంది. జూన్ నెలలో బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని భర్తీ చేయడానికి జరుగుతోంది. ఈసారి జూబ్లీహిల్స్‌లో త్రికోణ పోటీ నెలకొననుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పోటీచేస్తుండగా, కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్‌ను, బీజేపీ లంకా దీపక్ రెడ్డిని అభ్యర్థులుగా నిలిపింది. దీపక్ రెడ్డి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు. ఇక అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఈసారి కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించింది.









