గోల్డెన్ న్యూస్ /కొమురం భీమ్ : సీఎంఆర్ బియ్యం తిరిగి అప్పగించేందుకు అనుమతి కోసం ఓ రైసు మిల్లు యజమాని నుంచి పౌరసరఫరాల సంస్థ కుమురం భీం జిల్లా మేనేజర్(డీఎం) జి.వి. నర్సింహారావు రూ.75 వేలు లంచం డిమాండ్ చేసి తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఆదిలాబాద్ అనిశా డీఎస్పీ జి.మధు, బాధితుడు వాసవి మోడ్రన్ రైస్ మిల్లు యజమాని సందీప్ తెలిపిన వివరాల ప్రకారం.. దహెగాం మండలంలోని వాసవి రైసు మిల్లుకు పౌరసరఫరాలశాఖ అధికారులు సీఎంఆర్ కోసం ధాన్యం కేటాయించారు. మూడు నెలల కిందట మర ఆడించిన బియ్యాన్ని పౌరసరఫరాల సంస్థకు అప్పగించేందుకు అనుమతి కోసం డీఎంను సందీప్ మూడు నెలల క్రితం సంప్రదించాడు. మూడు ఏసీకేల (ఒక ఏసీకే అంటే 290 క్వింటాళ్లు) బియ్యాన్ని యజమాని అప్పగించాల్సి ఉంది. అందుకు అనుమతి ఇచ్చేందుకు ఒక్కో ఏసీకేకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ.75 వేలు ఇవ్వాలని డీఎం మూడు నెలలుగా డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితుడు ఎట్టకేలకు ఇటీవల ఏసీబీని ఆశ్రయించారు. గురువారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్లపై ఏర్పాటు చేసిన సమావేశానికి సందీప్ వచ్చారు. అక్కడికి ఏసీబీ అధికారులు సైతం వచ్చారు.









