50 శాతం రిజర్వేషన్లతో ‘లోకల్ ఫైట్’.. వచ్చే నెలలోనే ముహూర్తం!
వచ్చే నెలలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నది. ఇందుకనుగుణంగా కసరత్తును వేగవంతం చేసింది.
ఇందులో భాగంగానే ఈ నెల 12న కేబినెట్సమావేశం ఏర్పాటు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో హైకోర్టు సూచించిన విధంగా 50 శాతం రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్లాలని మంత్రివర్గ భేటీలో అధికారికంగా నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని ఇప్పటికే హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లినా లాభం లేకుండా పోయింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం చెప్పడంతో ప్రభుత్వానికి మరో మార్గం లేకుండా పోయింది. దీంతో 50 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితి నెలకొన్నది.
ఎన్నికల సంఘంపై పిటిషన్
రిజర్వేషన్ల విషయంలో న్యాయస్థానం ఆదేశాలను రాష్ట్ర ఎన్నికల సంఘం పాటించడం లేదంటూ హైకోర్టులో పిటిషన్దాఖలైంది. కానీ, అంతకు ముందే ప్రభుత్వానికి ఎన్నికల సంఘం లేఖ రాసింది. కోర్టు సూచించిన విధంగా తమకు రిజర్వేషన్ల జాబితా అందించాలని అందులో పేర్కొంది. కానీ, ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. దీంతో సర్కారు డెసిషన్ కోసం ఎన్నికల కమిషన్ ఎదురు చూస్తున్నది.
నెలాఖరులోగా ఎన్నికల షెడ్యూల్..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగియగానే 12న కేబినెట్సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పాత విధానంలో (50 శాతం రిజర్వేషన్లతో) ఎన్నికలు నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకోబోతున్నదని అధికార వర్గాల ద్వారా తెలిసింది. కేబినెట్తీర్మానం అనంతరం పంచాయతీరాజ్ శాఖ రిజర్వేషన్లను మరోసారి కలెక్టర్ ద్వారా ఖరారు చేయనున్నది. అనంతరం ఆ జాబితా ఎన్నికల సంఘానికి అందిస్తారు. ఈ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్ విడుదలయ్యేలా కసరత్తు జరుగుతున్నది. ఎన్నికలు నిర్వహించేందుకు ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ సిద్ధంగా ఉన్నందునా.. రిజర్వేషన్లు ఖరారు చేస్తే వెంటనే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. దీంతో వచ్చే నెలలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ఎన్నికలు జరుగుతాయని ప్రభుత్వం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది. ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం చేయడం సరికాదనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. పార్టీ కేడర్ నుంచి ఒత్తిడి, కేంద్రం నుంచి నిధులు ఇలా అనేక విషయాలతో ఎన్నికలు ముడిపడి ఉన్నాయని మెజార్టీ మంత్రులు, ముఖ్యనాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేడు జరగాల్సిన కేబినెట్ భేటీని 12వ తేదీకి వాయిదా వేసినట్టు సమాచారం. చట్టప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధ్యం కాకుంటే పార్టీ పరంగా అమలు చేస్తామని ఇప్పటికే కాంగ్రెస్ ప్రకటించింది.









