గోల్డెన్ న్యూస్ / తెలంగాణ : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవ్య హోమ్స్ కాలనీలో ఓ దుర్ఘటన చోటుచేసుకుంది. చీమలకు భయపడి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
మనీషా (25) అనే వివాహిత తన ఇంట్లో ఫ్యానుకు చీరతో ఉరివేసుకొని బలవన్మరణం చేసుకుంది. సమాచారం మేరకు, మనీషాకు చిన్నప్పటి నుంచే చీమలంటే తీవ్ర భయం (మైర్మెకోఫోబియా) ఉందని, ఈ భయం ఇటీవల మరింతగా పెరిగిందని సీఐ నరేష్ తెలిపారు.
మనీషా భర్త శ్రీకాంత్ (35) 2022లో ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి అన్నికా (3) అనే చిన్న కుమార్తె ఉంది. భర్త ఉద్యోగానికి వెళ్లిన సమయంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న మనీషా ఈ దారుణ చర్యకు పాల్పడింది.
ఘటన స్థలంలో పోలీసులు ఒక సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. అందులో మనీషా “I am sorry, అన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్నవరం, తిరుపతి హుండీలో రూ.1116 వేయండి. ఎల్లమ్మకు వాడు బియ్యం పోయడం మర్చిపోకండి” అని రాసినట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మానసిక భయం, మైర్మెకోఫోబియా కారణంగా ఆత్మహత్య చేసుకుందనే ప్రాథమిక సమాచారం లభ్యమైంది.








