మహిళలకు అండగా కేంద్ర ప్రభుత్వ పథకం. దేశంలోని మహిళలు అన్ని రంగాల్లో సమానంగా ఎదగాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగిని పథకాన్ని తీసుకువచ్చింది. మహిళలు స్వయం ఉపాధి సాదించాలని, ఆర్థికంగా ఎదగాలని వారికి ఆర్థిక భరోసా ఇస్తోంది. సొంత వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు వడ్డీ లేని రుణాలు లేదా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తోంది. అంతేకాకుండా రుణాల చెల్లింపులో కూడా సబ్సిడీ ఇస్తోంది. మహిళలు స్వంత కాళ్లపై నిలబడి వ్యాపార రంగంలో రాణించాలని కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకాన్ని పలు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో కూడా అమలవుతోంది. మహిళలు సొంతంగా చిన్న, మధ్య తరహా వ్యాపారాలు ప్రారంభించడానికి ఉపయోగపడుతోంది.
లోన్ ఎంత వస్తుంది?
ఉద్యోగిని పథకం కింద మహిళలు గరిష్టంగా రూ.3 లక్షల వరకు లోన్ వస్తుంది. ఈ రుణానికి మహిళలు ఎలాంటి సెక్యూరిటీ ఇవ్వాల్సిన పని లేదు. ఈ లోన్ తిరిగి చెల్లించడానికి బ్యాంకులు సుమారుగా 3 నుంచి 7 సంవత్సరాల వరకు సమయాన్ని ఇస్తాయి. ఇది తీసుకున్న లోన్ మొత్తం, బ్యాంకు నిబంధనలపై ఆధారపడి ఉంటుంది.దరఖాస్తు చేయనున్న మహిళ వయస్సు 18 నుంచి 55 ఏళ్ళ మధ్య ఉండాలి. దరఖాస్తుదారు ఇంతకుముందు ఏ ఆర్థిక సంస్థ నుంచి తీసుకున్న రుణాలకూ ఎగవేతదారుగా ఉండకూడదు. దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సాధారణంగా రూ.2,00,000 మించకూడదు. వితంతువులు, వికలాంగులు, దళిత మహిళలు వంటి కొన్ని వర్గాల మహిళలకు అన్యువల్ ఇన్ కమ్ లిమిట్ వర్తించదు. ఇక కొన్ని రాష్ట్రాల్లో అయితే (Eg: కర్ణాటక) ఆ రాష్ట్రంలో శాశ్వతంగా నివసిస్తున్నవారై ఉండాలి.
ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి మహిళలు బ్యాంకులను సంప్రదించాల్సి ఉంటుంది. కమర్షియల్ బ్యాంకులు, సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్లు వంటి సంస్థల వద్దకు వెళ్లి అధికారులతో మాట్లాడాలి. వారు సూచించిన విధముగా దరఖాస్తు సమర్పించాలి. రాష్ట్ర మహిళా అభివృద్ధి కార్పొరేషన్ కార్యాలయం/ ఆన్‌లైన్ పోర్టల్‌లో కూడా దరఖాస్తు ఫారాలు అందుబాటులో ఉంటాయి. వీటిని జిరాక్స్ తీసుకొని అన్ని వివరాలను నింపి అధికారులకు సమర్పించాల్సి ఉంది.
సమర్పించాల్సిన పత్రాలు:
ఆధార్ కార్డు. పూర్తిగా నింపిన దరఖాస్తు ఫారమ్, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రం, చిరునామా ధ్రువీకరణ పత్రం, కుటుంబ వార్షిక ఆదాయ ధ్రువీకరణ పత్రం, కుల ధ్రువీకరణ పత్రం (వర్తిస్తే), బీపీఎల్ కార్డు (ఉంటే), పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, ఏ వ్యాపారానికి దరఖాస్తు చేస్తున్నారో దాని ప్రణాళిక ఉండాలి. ఇక ఈ పథకం ద్వారా దాదాపు 88 రకాల చిన్న వ్యాపారాలకు రుణాలు అందిస్తున్నారు. అగరబత్తీలు/కొవ్వొత్తుల తయారీ, బేకరీ, క్యాంటీన్, కేటరింగ్ సేవలు, గాజుల తయారీ, బ్యూటీ పార్లర్, వంట నూనెల వ్యాపారం, పండ్లు, కూరగాయల అమ్మకం, చేనేత/వస్త్రాలపై ఎంబ్రాయిడరీ పనులు, పాలు/డెయిరీ ఉత్పత్తుల యూనిట్, పాపడ్/జామ్/జెల్లీ తయారీ, పుస్తకాలు/నోట్‌బుక్స్ తయారీ, క్లీనింగ్ పౌడర్, కాఫీ, టీ పౌడర్ తయారీ వంటి వ్యాపారాలకు లోన్లు ఇస్తారు.
ఇక వడ్డీ లేని రుణాన్ని షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వికలాంగులు, వితంతువులు వంటి ప్రత్యేక వర్గాలకు చెందిన మహిళలకు అందిస్తారు. లోన్ మొత్తంలో 50 శాతం వరకు సబ్సిడీ వర్తిస్తుంది. అంటే గరిష్టంగా దాదాపు రూ.90,000 వరకు సబ్సిడీ ఉంటుంది. మిగితా రుణాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. జనరల్, ఓబీసీ మహిళలకు వడ్డీ 10 శాతం నుంచి 12 శాతం మధ్య ఉంటుంది. వీళ్లకు వడ్డీ రేటు బ్యాంకు, రాష్ట్ర వాటా అమలును బట్టి స్వల్పంగా మారవచ్చు. వీరికి కూడా లోన్ మొత్తంలో 30% వరకు సబ్సిడీ లభిస్తుంది. దీనిని ప్రభుత్వమే భరిస్తోంది…
https://whatsapp.com/channel/0029Vb5x89p4o7qE8tD1fE1H








