దేశంలోనే ఏ సంస్థల్లో లేని విధంగా సింగరేణి ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం.

♦ సింగరేణి ఉద్యోగుల ఇండ్ల నిర్మాణం కోసం 300 కోట్లు వెచ్చించనున్న సంస్థ.

♦ హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటుకు చర్యలు..

♦ 39వ నిర్మాణాత్మక సమావేశంలో పాల్గొన్న గుర్తింపు సంఘం నాయకులు, సంస్థ సి&ఎండీ.

♦ సింగరేణి సుస్థిర భవిష్యత్ కోసం సంపూర్ణ సహకారం అందిస్తాం

సింగరేణిని విశ్వవ్యాప్తం చేస్తున్న సీఎండీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన గుర్తింపు సంఘం గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.

 

రాష్ట్ర ప్రభుత్వ దిశా నిర్దేశంలో అంతర్జాతీయ సంస్థగా ఎదుగుతున్న సింగరేణికి సుస్థిర భవిష్యత్ అందించడానికి ప్రతీ ఉద్యోగి భాగస్వామి కావాలని, ముఖ్యంగా పని సంస్కృతిని మెరుగు పరుస్తూ ప్రతీ ఒక్క ఉద్యోగి తనకు కేటాయించిన షిఫ్ట్ లో 8 గంటల పూర్తి సమయాన్ని కంపెనీ కోసం పనిచేసేందుకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు గుర్తింపు కార్మిక సంఘం సహకారం అందించాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ కోరారు.  

 

సోమవారం హైదరాబాద్ సింగరేణి భవన్ లో గుర్తింపు కార్మిక సంఘం అయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ తో జరిగిన 39వ నిర్మాణాత్మక సమావేశంలో ఆయన మాట్లాడారు..

బొగ్గు రంగంలో పోటీని తట్టుకునేందుకు బొగ్గు ధరలను తగ్గించామని, ఈ నేపథ్యంలో ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడం అనివార్యమని, అప్పుడే సంక్షేమ కార్యక్రమాలను కూడా కొనసాగించడానికి, ఉపాధి కల్పనకు అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. 

ఉత్పత్తి ఖర్చు తగ్గించాలంటే ఉద్యోగులు పూర్తి పని గంటలు సద్వినియోగం చేస్తూ యంత్రాలను పూర్తిగా వినియోగించాలన్నారు. విధులకు గైర్హాజరు అవుతున్న కార్మికులు విధులకు హాజరయ్యేలా అవగాహన కల్పించాలని, తద్వారా క్రమశిక్షణను పెంచడం సాధ్యమవుతుందన్నారు. రక్షణ, నాణ్యత పెంపుదలకు మరింత కృషి జరగాలన్నారు.   

సింగరేణి సంస్థ రానున్న రోజుల్లో దేశంలోని 10 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహించేలా విస్తరణ ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు సాగుతున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. బొగ్గు రంగానికే పరిమితమైన సంస్థను 5 వేల మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి చేసేలా తీర్చిదిద్దేందుకు వీలుగా సింగరేణి గ్రీన్ ఎనర్జీ, అలాగే విశ్వవ్యాప్తంగా కీలక ఖనిజ అన్వేషణ, మైనింగ్కు సింగరేణి గ్లోబల్ లిమిటెడ్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. సింగరేణిలో ఉన్న 40 వేల మంది ఉద్యోగులు, సంస్థపై ఆధారపడిన 30 వేల మంది కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్ దృష్ట్యా కొత్త బొగ్గు గనులను వేలంలో దక్కించుకోవడానికి కృషి చేస్తున్నామని, తద్వారా సింగరేణికి మరో వందేళ్ల భవిష్యత్ ఉంటుందన్నారు. 

300 కోట్ల వ్యయంతో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం..

సింగరేణి ఉద్యోగులకు దేశంలోనే ఏ సంస్థల్లో లేని విధంగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని, వీటిని మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎండీ ఎన్.బలరామ్ తెలిపారు. ఉద్యోగులకు విశాలమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం కోసం 300 కోట్లకు పైగా వెచ్చించి గోదావరిఖని, శ్రీరాంపూర్, మణుగూరు, కొత్తగూడెం, భూపాలపల్లి తదితర ప్రాంతాల్లో వెయ్యి క్వార్టర్ల నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. అలాగే అత్యాధునిక వైద్య సేవలు అందించడానికి గోదావరిఖనిలో వచ్చే రెండు నెలల్లో క్యాథ్ ల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. హైదరాబాద్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు కోసం చర్యలు తీసుకున్నట్లు వివరించారు. ఉద్యోగుల పిల్లలకు జాతీయ స్థాయి విద్యా బోధనను అందించేందుకు ఇప్పటికే రామగుండం-2 ఏరియాలో సీబీఎస్ఈ స్కూల్ను ప్రారంభించామని, ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఉద్యోగుల సంక్షేమం తమ బాధ్యత అని, కానీ కంపెనీ మనుగడ విషయంలో పని సంస్కృతిని మెరుగుపరిచే బాధ్యతను పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. సింగరేణిని అంతర్జాతీయ కంపెనీగా తీర్చిదిద్దడానికి సీఎండీ ఎన్.బలరామ్ తీసుకుంటున్న చొరవను ప్రత్యేకంగా అభినందించారు. సింగరేణిని కాపాడటానికి తమ యూనియన్ తరఫున ఎన్నో త్యాగాలు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని రూపొందించాలని, కొత్తగూడెంలో క్యాథ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. విశ్రాంత కార్మికులకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలన్నారు. కొత్తగూడెం భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకుని అక్కడ సింగరేణి ఆధ్వర్యంలో థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగరేణి పుట్టినిల్లు అయిన ఇల్లందు భవిష్యత్ కోసం కొత్త ప్రాజెక్టును త్వరగా ప్రారంభించాల్సిందిగా కోరారు. సింగరేణిలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికుల కోసం ఈఎస్ఐ సేవలు అందించేందుకు యాజమాన్యం తీసుకున్న చొరవను అభినందించారు. అలాగే కొత్తగూడెం బస్టాండ్ ఆధునికీకరణ కోసం సామాజిక బాధ్యత నిధులను కేటాయించిన యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. 

గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పలు సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. సంస్థ ఛైర్మన్ మరియు ఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ గుర్తింపు కార్మిక సంఘం ద్వారా వివరించిన సమస్యలపై నిబంధనల మేరకు పరిశీలించి చర్యలు తీసుకుంటామని, ఆర్థిక పరమైన సమస్యలపై కమిటీలు వేసి చర్యలు తీసుకుంటామన్నారు.  

కార్యక్రమానికి డైరెక్టర్(పర్సనల్) గౌతమ్ పొట్రు స్వాగత ఉపన్యాసం చేశారు. డైరెక్టర్లు ఎల్.వి. సూర్యనారాయణ (ఆపరేషన్స్), కె.వెంకటేశ్వర్లు (పి అండ్ పి), ఎం.తిరుమల రావు (ఈ అండ్ ఎం), జీఎం(కో ఆర్డినేషన్) టి.శ్రీనివాస్, జీఎం(పర్సనల్) ఐఆర్, పీఎం కవితా నాయుడు, ఇతర జీఎంలు పాల్గొన్నారు. గుర్తింపు కార్మిక సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య, జనరల్ సెక్రెటరీ రాజ్ కుమార్ తో పాటు వివిధ ఏరియాల నుండి హాజరైన గుర్తింపు కార్మిక సంఘం ప్రతినిధులు అనేక సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు.

ఈ సమావేశంలో పాల్గొన్న కార్మిక నాయకులు కొందరు మాట్లాడుతూ.. సంస్థ ఛైర్మన్ ఎన్.బలరామ్ ఎంతో సాదాసీదాగా కార్మికులతో కలిసిపోయి వారి సమస్యలు తెలుసుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఆయన ఒక ఛైర్మన్ గా కంటే ప్రజల మనిషిగా కార్మికుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram