రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, ఎమ్మెల్యే హరీష్ రావు
గోల్డెన్ న్యూస్/ హైదరాబాద్: ధర్నాల పేరుతో రోడ్లపై సర్కస్ ఫీట్లు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్‌ను ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి, బీ ఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు.
అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. అదానీ.. ప్రపంచం ముందు భారతదేశం పరువు తీశారని రేవంత్‌రెడ్డి అంటున్నారు.. అదానీతో చేతులు కలిపి సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ పరువు తీయలేదా.. అని విమర్శించారు.
తెలంగాణలో వివిధ సంస్థల ఏర్పాటు కోసం అదానీతో సీఎం రేవంత్ రెడ్డి రూ.12,400 కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. రూ.100 కోట్లు ఎలా వాపస్ ఇచ్చావో.. ఈ రూ.12,400 కోట్ల ఒప్పందాలు కూడా రద్దు చేసుకుని నిజాయతీ నిరూపించుకోవాలి. బయట కుస్తీ.. లోపల దోస్తీ అన్నట్టుంది రేవంత్‌రెడ్డి వ్యవహారం. రామన్నపేటలో డ్రైపోర్టుకు అనుమతిస్తే.. అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతిచ్చింది. దాదాపు 12 గ్రామాల ప్రజలు సిమెంట్ ఫ్యాక్టరీ వల్ల కాలుష్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అదానీ సిమెంట్ ఫ్యాక్టరీ కోసం పోలీసులను పెట్టి ఆందోళనకారులను అణచివేస్తున్నారు. పోలీసు పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డి, అదానీ సంబంధాలపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని భారాస డిమాండ్ చేస్తోంది అని హరీశ్‌రావు అన్నారు.