TGB Guidelines : ‘ఒక రాష్ట్రం, ఒక గ్రామీణ బ్యాంకు’ నినాదంతో తెలంగాణలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్(APGVB) శాఖలను తెలంగాణ గ్రామీణ బ్యాంకులో విలీనం చేశారు.
జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలోని అతి పెద్ద గ్రామీణ బ్యాంకుల్లో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఒకటిగా అవతరించింది. ఏపీజీవీబీ శాఖలు, వ్యవస్థల విలీనం కోసం కార్యకలాపాలు, ఆన్ లైన్ బ్యాంకింగ్ సేవలు నాలుగు రోజుల పాటు అంటే 28-12-2024 నుంచి 31-12-2024 వరకు నిలిపివేశారు. ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి తిరిగి అందుబాటులోకి వచ్చాయి. తెలంగాణలోని ఏపీజీవీబీ శాఖలకు సంబంధించిన ఖాతాదారులు ఏటీఎం కార్డు మార్చుకోవడానికి 01.01.2025 తరువాత, వారి బ్యాంకు శాఖను సంప్రదించాలని బ్యాంకు అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం టీవీబీ వెబ్సైట్ www.tgbhyd.in ను (లేదా) టోల్ ఫ్రీ నంబర్ 1800 202 725 సంప్రదించవచ్చని సూచించారు. ఏపీజీవీబీ ఖాతాలు కలిగిన తెలంగాణ కస్టమర్లకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ మార్గదర్శకాలు జారీ చేసింది.
ఖాతాదారులకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మార్గదర్శకాలు
ఏపీజీవీబీ బ్యాంకు ఏటీఎం కార్డులను మార్చుకోవడానికి జనవరి 1 తర్వాత నుంచి మీ ఖాతా ఉన్న బ్యాంకులో సంప్రదించాలి.
ఏపీజీవీబీ మొబైల్ బ్యాంకింగ్ వినియోగదారులు, ప్లే స్టోర్ నుంచి టీజీబీ మొబైల్ బ్యాంకింగ్ యాప్ ను డౌన్లోడ్ చేసుకొని తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
ఏపీజీవీబీ చెక్‌బుక్ కలిగిన కస్టమర్లకు టీజీబీ కొత్త చెక్ బుక్ లను ఇప్పటికే మీ చిరునామాకు పంపించారు.
ఏపీజీవీబీ పాత చెక్ బుక్ లను వినియోగించవద్దు. పాత చెక్ బుక్ ఉంటే వాటిని మీరు ఖాతా కలిగిన శాఖలో తిరిగి అప్పగించాల్సి ఉంటుంది.
ఇప్పటికే ఏపీజీవీబీ చెక్ జారీ చేస్తే అది 90 రోజుల వరకు చెల్లుబాటు అవుతుంది. దీనిపై ఖాతాదారులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ వినియోగించే ఖాతాదారులు www.tgbhyd.in ద్వారా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
నగదు బదిలీకి ఉపయోగించే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ లావాదేవీలకు ఉపయోగించే ఐఎఫ్ఎస్సీ కోడ్ మారింది. అకౌంట్ హోల్డర్స్ ఇకపై SBIN0RRDCGB కోడ్ ను వినియోగించాల్సి ఉంటుంది.
టీజీబీ వాట్సాప్ బ్యాంకింగ్, మిస్ కాల్ అలర్ట్ కోసం టోల్ ఫ్రీ నంబర్ 92780 31313ను సంప్రదించాలి.
ఈ మార్గదర్శకాలు ఏపీజీవీబీ బ్యాంక్ ఖాతాలు కలిగిన తెలంగాణలోని కస్టమర్లకు మాత్రమే వర్తిస్తాయి.