మళ్లీ భయంభయం..
వింత వింత వ్యాధులతో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు . తాజాగా మరో కొత్త వ్యాధి తమిళనాడు రాష్ట్రంలో వెలగులోకి వచ్చింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు వేగంగా వ్యాప్తి చెందుతుంది. అప్రమత్తమై వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ముమ్మరంగా ప్రచారం చేస్తుంది..
తమిళనాడు : కోవిడ్ అనంతరం ప్రపంచంలో ఎక్కడో ఓ చోట తెలియని అలజడి. నిత్యం కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తున్నాయి. జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజగా తమిళనాడులో మరో కొత్త మహమ్మారి పుట్టుకొచ్చింది. స్క్రబ్ టైఫస్ కేసులు తమిళనాడులో నానాటికీ పెరిగిపోతున్నాయి. చెన్నై, కాంచీపురం, తిరుపత్తూరు, తిరువళ్లూరు, చెంగల్పట్టు, రాణిపేట్, వెల్లూరు జిల్లాల్లో అధికంగా కేసులు నమోదవుతున్నాయి. వ్యాధి వ్యాప్తిని నియంత్రించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజారోగ్య శాఖ ఆయా జిల్లా అధికారులకు సూచనను జారీ చేసింది…స్క్రబ్ టైఫస్ అనేది.. ఓరియంటియా సుత్సుగముషి జాతికి చెందిన బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్. స్క్రబ్ టైఫస్ కీటకాల కాటు ద్వారా వ్యాపిస్తుంది. వీటిని చిగ్గర్స్ అని పిలుస్తారు. ఈ కీటకాలు సాధారణంగా పొదలు, అటవీ ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ వ్యాధి పిల్లలు, పెద్దలు ఎవరికైనా రావచ్చు. స్క్రబ్ టైఫస్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, అలసట, ఒంటిపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి తీవ్రమైతే స్క్రబ్ టైఫస్ న్యుమోనైటిస్, మెనింజైటిస్, గుండె వైఫల్యం వంటి సమస్యలకు దారితీస్తుంది. కొన్ని సందర్భాల్లో అవయవ వైఫల్యానికి కూడా కారణమవుతుంది.