గోల్డెన్ న్యూస్/ భద్రాద్రి కొత్తగూడెం : కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బాల కార్మికుల నిర్మూలన పరేషన్ స్మైల్ XI విడుతలో జిల్లా వ్యాప్తంగా 40 మంది బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని అన్ని శాఖల సమన్వయంతో విజయవంతంగా నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శనివారం ఒక ప్రకటనను విడుదల చేశారు.ఆపరేషన్ స్మైల్ విజయవంతం కోసం జిల్లాలో 05 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు.ఇందులో భాగంగా జనవరి 1 నుండి 31 వరకు నెల రోజుల పాటు ఆపరేషన్ స్మైల్ -XI కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది.ఇందులో 40 మంది బాలకార్మికులను గుర్తించడమైనదని తెలిపారు.ఇందులో 33 మంది అబ్బాయిలు ,ఏడుగురు బాలికలు ఉన్నారని తెలిపారు. వారిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.జిల్లా వ్యాప్తంగా చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 27 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందన్నారు. బాల కార్మికుల వ్యవస్థ నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా కృషి చేయాలని కోరారు. ఎవరైనా బాలలను పనిలో పెట్టుకున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి పోలీసు వారికి సమాచారం అందించాలని తెలిపారు.ఆపరేషన్ స్మైల్ లో భాగంగా బాల కార్మికులను వారి తల్లిదండ్రులకు అప్పగించిన ప్రత్యేక బృందాల సభ్యులను ఎస్పీ గారు అభినందించారు.
