గుడ్లపై ముద్ర..అవకతవకలకు అడ్డుకట్ట

అంగన్వాడీల్లో పారదర్శకంగా కోడిగుడ్ల పంపిణీ

 – అర్హులకే లబ్ధిచేకూరేలా ప్రభుత్వం చర్యలు

గోల్డెన్ న్యూస్ /కరకగూడెం: అంగన్వాడీ కేంద్రాల ద్వార అందిస్తున్న పౌష్టికాహారం పక్కదారి పట్టకుండా గత రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది.ముఖ్యంగా కోడిగుడ్లు ఎక్కడోచోట అవకతవకలు జరుగుతూ లబ్ధిదారులకు అందక బయటి వ్యక్తులకు కొద్దరు కేంద్రాల నిర్వాహకులు విక్రయాలు జరిపారు.దీంతో లబ్ధిదారులకు మరింత పారదర్శకంగా కోడిగుడ్లు అందాలనే ఉద్దేశంతో జోన్ల వారీగా వాటిపై ముద్రలు వేసి మూడు రంగుల్లో విడుతల వారీగా అంగన్వాడీలకు సరఫరా చేయించి, లబ్ధిదారులకు గతేడాది నుంచి పంపిణీ చేస్తున్నారు.తద్వారా అర్హులకే పౌష్టికాహారం అందనుండడంతో సర్వత్రా ఈ విధానంపై హర్షం వ్యక్తం అవుతున్నది.అంతేకాకుండా ప్రభుత్వం కోడిగుడ్లను పారదర్శకంగా అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా జోన్లుగా విభజించి అందిస్తున్నది.ఈ క్రమంలో ఆ గుడ్లపై ‘జోన్-4 తెలంగాణ ప్రభుత్వం’ అని రౌండ్ సీల్ మాదిరి ముద్రించిన గుడ్లు మండలంలోని అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతున్నాయి.ఈ ముద్రలను నీలం రంగు, ఆకుపచ్చరంగు, ఎరుపు రంగుల్లో మూడు విడుతల్లో అందజేస్తుండగా.. ఎండాకాలం తర్వాత నీలం, ఎరుపు రంగుల్లో అంగన్వాడీలకు సరాఫరా చేయనున్నారు. మొదట సరఫరా చేసిన రంగు గుడ్లు పూర్తిగా అయిపోయాకే మరో విడుత అందజేయనున్నారు.ఇలా పకడ్బందీగా సరఫరా చేయడంతో ఎప్పటి గుడ్లు అప్పుడే పంపిణీ జరుగడంతో పాటు ఎక్కడా కూడా పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరే అవకాశం ఉంటుంది.

సంపూర్ణ ఆరోగ్యంమే లక్ష్యంగా చర్యలు..

పిల్లలు, గర్భిణులు, బాలింతల ఆరోగ్య పరిరక్షణే ప్రభుత్వ లక్ష్యం.మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేయాలని, ఆ మార్పులు పటిష్టమైన ఆహార పంపిణీకి దారి తీయాలన్న సంకల్పంతో అంగన్వాడీ కేంద్రాలల్లో అనేక మార్పులకు అధికారులు శ్రీకారం చుట్టారు.మండలంలో 51 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో బాలింతల నుంచి చిన్నారుల వరకు సుమారు 900 మంది లబ్ధిదారులు లబ్ధి పొందుతున్నారు. ఇందులో గర్భిణులు 150మంది, బాలింతలు 140 మంది, 600 చిన్నారులు ఉన్నారు. గర్భిణులు, బాలింతలతో పాటు మూడు నుంచి ఆరు సంవత్సరాల చిన్నారులకు రోజుకొకటి చొప్పున రెండు విడుతల్లో గుడ్లను అందజేస్తున్నారు. అంతేకాకుండా 14 మినీ అంగన్ వాడీ కేంద్రాలను ఇటీవల ప్రభుత్వం మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మార్చింది.కాగా అంగన్వాడీల ద్వారా ప్రభుత్వం నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నదని దీనిని ప్రతి విడతలో తప్పనిసరిగా లబ్ధిదారులు తీసుకోని సద్వినియోగం చేసుకోవాలని మణుగూరు ప్రాజెక్ట్ సీడీపీఓ జయలక్ష్మి పేర్కొన్నారు.అదేవిధంగా చిన్నారుల్లో భవిష్యత్తులో పౌష్టికాహార లోపం నివారించుకోవడానికి కేంద్రాలను నిత్యం పర్యవేక్షిస్తూ..బాలింతలు, తల్లులకు అవగాహన కల్పిస్తున్నాంమని తెలిపారు.కోడిగుడ్లపై ముద్రలు వేసి, మూడు దశల వారీగా సరఫరా చేయడం వల్ల మండలంలో పంపిణీ పారదర్శకంగా జరుగుతున్నదని పేర్కొన్నారు.

Facebook
WhatsApp
Twitter
Telegram