మారనున్న ఫ్యూచర్ సిటీ రూపురేఖలు..?

హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్‌ల తరువాత నాలుగో పెద్ద నగరంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పించారు. ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలవాలనే లక్ష్యంతో, ఇది పర్యావరణహిత “గ్రీన్ సిటీ” గా రూపుదిద్దుకోనుంది. ఈ ప్రాజెక్టులో కీలక భాగంగా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో రైల్ విస్తరణ ప్రణాళికను హెచ్ఎండీఏ, టీజీఐఐసీ సంయుక్తంగా రూపొందిస్తున్నాయి.

 

ఫ్యూచర్ సిటీకి మెట్రో ద్వారా వేగంగా చేరుకోవాలని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్ సిటీకి గ్రీన్ కారిడార్ అభివృద్ధి చేయాలని ప్రణాళిక రూపొందిస్తున్నారు. దాదాపు 15,000 ఎకరాల్లో విస్తరించనున్న ఈ ప్రాజెక్టుకు మెట్రో రైల్ కీలక పాత్ర పోషించనుంది. అంతర్జాతీయ స్థాయి ప్రయాణ సౌకర్యాలను అందించేందుకు “హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో లిమిటెడ్” సంస్థ కసరత్తు ప్రారంభించింది.

 

మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి క్షేత్రస్థాయి పర్యటన..

 

సోమవారం మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎయిర్‌పోర్ట్ నుంచి మీర్ ఖాన్ పేట్‌లో నిర్మాణంలో ఉన్న స్కిల్ యూనివర్సిటీ వరకు మెట్రో కారిడార్ సర్వే పనులను పరిశీలించారు. కొంగర కలాన్ దాటిన తరువాత రోడ్డు లేకపోవడంతో కాలినడకన కొండలు, గుట్టలు దాటి ఆయన సర్వే చేపట్టడం విశేషం. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ఫ్యూచర్ సిటీకి 40 కిలోమీటర్ల మేర మెట్రో మార్గం ఏర్పాటుకానుంది. ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ దగ్గర నుంచి కొత్తగా ఏర్పాటయ్యే మెట్రో రైల్ డిపో పక్కగా, ఎయిర్‌పోర్ట్ కాంపౌండ్ వాల్ వెంబడి మన్‌సాన్ పల్లి రోడ్డుగా ముందుకు సాగుతుంది. పెద్ద గోల్కొండ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వద్ద ఒక మెట్రో స్టేషన్ ఉండగా, తుక్కుగూడ, రావిర్యాల్ ఎగ్జిట్ల ద్వారా మెట్రో ట్రాక్ కొనసాగనుంది.

Facebook
WhatsApp
Twitter
Telegram