కేశవ్‌పురం కర్మాగారంలో భారీ అగ్ని ప్రమాదం
గోల్డెన్ న్యూస్ / వెబ్ డెస్క్:
దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు ఉదయం తీవ్ర ఉద్రిక్తత కలిగించిన ఘటనా చోటు చేసుకుంది. నగరంలోని కేశవ్‌పురం ప్రాంతంలో, లారెన్స్ రోడ్డులో ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ సమీపంలోని ఓ కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు భారీగా ఎగిసి పడ్డాయి. వేగంగా వ్యాపించిన మంటలతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ వ్యాపించి, స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
మంటలు వ్యాపిస్తుండడంతో సమీప నివాసాల్లో ఉన్న ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం వెంటనే ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం సుమారు 14 ఫైరింజన్లు మంటలను నియంత్రించేందుకు యత్నిస్తున్నాయి. అయితే, మంటలు భారీగా వ్యాపించిన నేపథ్యంలో సహాయక చర్యలు సవాళ్లతో కూడుకున్నట్లుగా తెలుస్తోంది.
ఇప్పటివరకు ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం అందలేదని అధికారులు తెలిపారు. అదేవిధంగా, ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావలసి ఉంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నప్పటికీ, ఈ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
అధికారులు సంఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు సమాచారం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరం లేని పరిస్థితుల్లో ఘటన ప్రాంతానికి రావొద్దని అధికారులు సూచించారు.