గోల్డ్ న్యూస్ / హైదరాబాద్ :నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వాతావరణం మారే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పలు జిల్లాలో వర్ష సూచన
హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, మెదక్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో వర్ష సూచన ఉంది. వీటి తో పాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లాల వాసులు కూడా వాన కోసం సన్నద్ధం కావలసిన అవసరం ఉంది.
ఈదురు గాలులు వీచే అవకాశం
వర్షాల సమయంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇది సాధారణ జనజీవనంపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.