గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు రెగ్యులర్

తాత్కాలిక 456 ఉద్యోగులను శాశ్వత ఉద్యోగాలుగా క్రమబద్ధీకరించాలంటూ హై కోర్టు నిర్ణయం

 

గోల్డెన్ న్యూస్ / హైదరాబాద్ ; తెలంగాణ గ్రామీణ బ్యాంకులో రోజువారీ వేతనం విధానంలో పనిచేస్తున్న 456 మంది ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు ఆదేశించింది. మెసెంజర్లు, స్వీపర్లు, ఇతర సాధారణ కార్మికులుగా పనిచేస్తున్నవారిని వారి అర్హతలను బట్టి.. శాశ్వత ఉద్యోగులుగా ఆఫీసు అటెంటెండ్స్‌ పోస్టుల్లోకి తీసుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే సర్వీసును వదిలేసిన వారికి, చనిపోయిన వారికి ఇది వర్తించదని స్పష్టం చేసింది. ప్రస్తుతం పనిచేస్తున్నవారి సర్వీసు వ్యవధిని బట్టి వెయిటేజీ ఇచ్చి, ఆరు నెలల్లో క్రమబద్ధీకరణ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది.

 

సుదీర్ఘకాలం నుంచి తాత్కాలిక పద్ధతిలో పనిచేస్తున్న తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని తెలంగాణ గ్రామీణ బ్యాంకును ఆదేశించాలంటూ 456 మంది తాత్కాలిక ఉద్యోగులు గతంలో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ పుల్ల కార్తీక్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది.

 

గ్రామీణ బ్యాంకు కేంద్ర, రీజనల్‌ కార్యాలయాలతోపాటు 400 శాఖల్లో 20 ఏళ్లుగా రోజువారీ వేతన విధానంలో పనిచేస్తున్నామని.. సర్వీస్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాల్సి వస్తుందనే ఉద్దేశంతో తమను క్రమబద్ధీకరించడం లేదని పిటిషనర్లు కోర్టుకు విన్నవించారు. ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని హైకోర్టు తీర్పు ఉందని వివరించారు. అయితే గ్రామీణ బ్యాంకు తరఫు న్యాయవాది వాదినలు వినిపిస్తూ.. పిటిషనర్లు ఔట్‌సోర్సింగ్‌ కార్మికులని, వారికి బ్యాంకుతో ఉద్యోగ-యాజమాన్య సంబంధం లేదని వివరించారు. కానీ ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంకు కేసులో ఇలాంటి వాదనలు నిలబలేదని, సుప్రీంకోర్టు కూడా క్రమబద్ధీకరణను సమర్థించిందని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ మేరకు తెలంగాణ గ్రామీణ బ్యాంకు తాత్కాలిక ఉద్యోగులైన 456 మంది పిటిషనర్లను క్రమబద్ధీకరించాలంటూ తీర్పు ఇచ్చింది.

Facebook
WhatsApp
Twitter
Telegram