పెళ్లయిన ఆరు నెలలకే భార్యా,భర్తల ఆత్మహత్య.
గోల్డెన్ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం : టేకులపల్లి మండలం దాస్ తాండ గ్రామపంచాయతీ రేగుల తాండకు చెందిన ఇస్లావ దీపిక (19)లు వెంకటయ్య తాండకు చెందిన బోడ శ్రీను (23)లు ఇద్దరు గత కొంతకాలంగా ప్రేమించుకున్నారు. వీరి ప్రేమ వ్యవహారం పెద్దలకు తెలియడంతో వారి వివాహం కుటుంబ సభ్యులు నిరాకరించారు. ఇరు కుటుంబ సభ్యులను ఎదిరించి ఆరు నెలల క్రితం వివాహం చేసుకొని వారికి దూరంగా ఉంటున్నారు. గత రెండు నెలలుగా కుటుంబ సభ్యులు వరకట్నం తీసుకురావాలని ఒత్తిడి చేస్తూ ఉండడంతో వారి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే దీపిక మూడు నెలల గర్భవతిగా తేలింది. ఈ సమయంలో ఎంతో ఆనందంగా గడపాల్సిన రెండు కుటుంబాలు వరకట్నం చిచ్చుతో విషాదంగా మారాయి. తరచూ వారి కుటుంబంలో గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన ప్రేమ జంట మనస్థాపంతో ఈ నెల 24వ తేదీన కూల్ డ్రింక్ లో గడ్డి మందు, ఎలుకల మందు కలుపుకొని మొదట శ్రీను సేవించాడు. ఆ తర్వాత తాను మందు తాగిన విషయాన్ని ఇంటికి వచ్చి భార్యకు తెలిపాడు. వెంటనే భార్య దీపిక కూడా అదే కూల్ డ్రింకును తీసుకొని తాగడంతో గమనించిన కుటుంబ సభ్యులు భార్యాభర్తలను మొదట కొత్తగూడెం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిద్దరిని పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మం జిల్లా హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ ఈనెల 25వ తేదీన దీపిక మృతి చెందగా, శ్రీను సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. జీవితంపై ఎన్నో ఆశలతో పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్న ప్రేమ జంట కుటుంబ కలహాలతో తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. ఆత్మహత్య చేసుకునే సమయానికి దీపిక మూడు నెలల గర్భవతి కావడం అందరిని కలచివేసింది ఈ ఘటన కన్నీటి పర్యంతం అయింది